బాలీవుడ్ హీరో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించిన సినిమా ‘ మున్నాభాయ్ ఎంబీబీఎస్’. ఈ సినిమాని తెలుగులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ గా రీమేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన పాత్రను బాలీవుడ్‌లో విశాల్ థక్కర్ పోషించాడు. కాగా మున్నాభాయ్ పార్ట్ 3 కోసం ఇటీవల చర్చలు జరుగుతుండగా ఓ షాకింగ్ విషయం వెలుగుచూసింది. మూడేళ్ల క్రితం డిసెంబరు 31న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ ఆచూకీ నేటికీ దొరకకపోవడం లేదు. విశాల్ కోసం పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిజానికి అతడు జీవించి ఉన్నాడో, లేదో కూడా తెలియడం లేదు.
డిసెంబరు 31, 2015న రాత్రి 10:30 గంటల సమయంలో ‘స్టార్ వార్స్’ సినిమాకు వెళ్దామని విశాల్ తన తల్లిని అడిగాడు. తాను రానని చెప్పడంతో ఆమె వద్ద రూ. 500 తీసుకుని ఒక్కడే వెళ్లాడు. ఆ తర్వాత తండ్రికి మెసేజ్ చేస్తూ న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నానని, ఉదయం వస్తానని తెలిపాడు. ఉదయం ఇంటికి వస్తానన్న కుమారుడు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి దుర్గ (60) జనవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
విశాల్ అదృశ్యంపై పోలీసులు మాట్లాడుతూ.. ‘2016 జనవరి 1వ తేదీన థానేలోని గాడ్ బందర్ రోడ్డులో ఉదయం 11:45 గంటలకు ప్రియురాలితో ఉన్నాడు. షూటింగ్ కోసం అంధేరి వెళ్లినట్లు సమాచారం. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అన్నది అతడి ఫేస్‌బుక్‌లో చివరి పోస్ట్. న్యూ ఇయర్ రోజు మధ్యాహ్నం 12:10 నిమిషాలకు ఆ పోస్ట్ చేశాడు. తర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అప్పటినుంచీ అతడి బ్యాంకు లావాదేవీలు జరగలేదు’ అని చెప్పారు.
విశాల్ అదృశ్యం కావడానికి సరిగ్గా రెండు నెలల ముందు అతడి ప్రియురాలు విశాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే,ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిరినట్టు సమాచారం. సినిమాలు లేకపోవడం, అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో అతడు మానసికంగా దెబ్బతిని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. మూడేళ్లయినా తమ కుమారుడి ఆచూకి లభించకోవడంలో విశాల్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'టాంగో చార్లీ', 'చాందిని బార్' తదితర చిత్రాలతోపాటు, టీవీ సీరియల్స్ విశాల్ థక్కర్ నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment