Vishal Thakkar
-
‘మున్నాభాయ్’ నటుడు అదృశ్యం.. మూడేళ్లయినా
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించిన సినిమా ‘ మున్నాభాయ్ ఎంబీబీఎస్’. ఈ సినిమాని తెలుగులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ గా రీమేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన పాత్రను బాలీవుడ్లో విశాల్ థక్కర్ పోషించాడు. కాగా మున్నాభాయ్ పార్ట్ 3 కోసం ఇటీవల చర్చలు జరుగుతుండగా ఓ షాకింగ్ విషయం వెలుగుచూసింది. మూడేళ్ల క్రితం డిసెంబరు 31న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ ఆచూకీ నేటికీ దొరకకపోవడం లేదు. విశాల్ కోసం పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిజానికి అతడు జీవించి ఉన్నాడో, లేదో కూడా తెలియడం లేదు. డిసెంబరు 31, 2015న రాత్రి 10:30 గంటల సమయంలో ‘స్టార్ వార్స్’ సినిమాకు వెళ్దామని విశాల్ తన తల్లిని అడిగాడు. తాను రానని చెప్పడంతో ఆమె వద్ద రూ. 500 తీసుకుని ఒక్కడే వెళ్లాడు. ఆ తర్వాత తండ్రికి మెసేజ్ చేస్తూ న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నానని, ఉదయం వస్తానని తెలిపాడు. ఉదయం ఇంటికి వస్తానన్న కుమారుడు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి దుర్గ (60) జనవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశాల్ అదృశ్యంపై పోలీసులు మాట్లాడుతూ.. ‘2016 జనవరి 1వ తేదీన థానేలోని గాడ్ బందర్ రోడ్డులో ఉదయం 11:45 గంటలకు ప్రియురాలితో ఉన్నాడు. షూటింగ్ కోసం అంధేరి వెళ్లినట్లు సమాచారం. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అన్నది అతడి ఫేస్బుక్లో చివరి పోస్ట్. న్యూ ఇయర్ రోజు మధ్యాహ్నం 12:10 నిమిషాలకు ఆ పోస్ట్ చేశాడు. తర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అప్పటినుంచీ అతడి బ్యాంకు లావాదేవీలు జరగలేదు’ అని చెప్పారు. విశాల్ అదృశ్యం కావడానికి సరిగ్గా రెండు నెలల ముందు అతడి ప్రియురాలు విశాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే,ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిరినట్టు సమాచారం. సినిమాలు లేకపోవడం, అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో అతడు మానసికంగా దెబ్బతిని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. మూడేళ్లయినా తమ కుమారుడి ఆచూకి లభించకోవడంలో విశాల్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'టాంగో చార్లీ', 'చాందిని బార్' తదితర చిత్రాలతోపాటు, టీవీ సీరియల్స్ విశాల్ థక్కర్ నటించాడు. -
బాలీవుడ్ నటుడు అదృశ్యం
ముంబై: టీవీ నటిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ కనిపించకుండా పోయాడు. రేప్ కేస్ ముద్ర పడడంతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. 2016 నూతన సంవత్సర వేడుకలను గర్ల్ ఫ్రెండ్ తో ఘనంగా జరుపుకున్న కొన్ని క్షణాల తర్వాత అతడు అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలం రేపింది. రేప్ కేసు నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో అదృశ్యం కావడంతో అతని తల్లిదండ్రులు విచారంలో మునిగిపోయారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ లో ప్రియురాలు రజనీ రాథోడ్ తో పార్టీ చేసుకుని ముంబైకి తిరిగి వస్తూ అతడు కనిపించకుండాపోయాడు. అప్పటి నుంచి అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎవరో ఫ్రెండ్ ను కలవడానికని వెళ్లి అదృశ్యమైనట్టుగా తెలుస్తోందని విచారణ అధికారి జయవంత్ పాడ్వి తెలిపారు. అయితే అత్యాచార ఆరోపణల నేపథ్యంలో అతనికి అవకాశాలు బాగా తగ్గి పోవడంతో డిప్రెషన్ కు లోనయ్యాడని ప్రియురాలు రజని చెప్పిందన్నారు. విశాల్ తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు అన్ని కోణాల్లో కేసులు దర్యాప్తు చేపట్టారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'టాంగో చార్లీ', 'చాందిని బార్' తదితర చిత్రాలతోపాటు, టీవీ సీరియల్స్ విశాల్ థక్కర్ నటించాడు. గత ఏడాది అక్టోబర్ లో సహనటిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలను ఎదుర్కొన్నాడు. సహజీవనం చేసి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఆమె కేసు పెట్టింది. అనంతరం ఇద్దరూ రాజీపడడంతో ఆమె కేసు ఉపసంహరించుకుంది. -
రేప్ కేసులో నటుడి అరెస్ట్
ముంబై: టీవీ నటిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసులో బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్‌ను ముంబై పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు చార్కోప్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ రామచంద్ర గైక్వాడ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి, నటుడు విశాల్ థక్కర్ గత కొన్ని నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ థక్కర్ నమ్మించాడు. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో పాటు శారీరకంగానూ వేధింపులకు గురిచేసేవాడని ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. నిఘా పెట్టిన మూడు రోజుల అనంతరం బొరివాలీ ఏరియాలో విశాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. విశాల్‌పై 323, 376, 420, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బుధవారం నాడు నిందితుడిని బొరివాలీ కోర్టులో ప్రవేశపెడతారు. విశాల్ థక్కర్... 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'చాందినీ బార్', తదితర సినిమాల్లో నటించాడు. -
రేప్ కేసులో ఇరుక్కున్న సినిమా నటుడు
ముంబై: బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ పై రేప్ కేసులో ఇరుక్కున్నాడు. టీవీ నటిపై అత్యాచారానికి పాల్పడినట్టు అతడిపై ముంబైలో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు చార్ కోప్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్ పెక్టర్ రామచంద్ర గైక్వాడ్ తెలిపారు. విశాల్ నివాసంలో తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. బాధితురాలు పలు టీవీ సీరియల్స్ లో నటించిందని పోలీసులు తెలిపారు. మిగతా వివరాలు వెల్లడించలేదు. విశాల్ పై 376(రేప్), 420(చీటింగ్), 323, 509, 506(క్రిమినల్ ఇంటిమిడేషన్) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు విశాల్ థక్కర్... మున్నాభాయ్ ఎంబీబీఎస్, టాంగో చార్లి, చాందిని బార్ తదితర సినిమాల్లో నటించాడు. అతడిని ఇంకా అరెస్ట్ చేయలేదు.