బాలీవుడ్ నటుడు అదృశ్యం
ముంబై: టీవీ నటిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ కనిపించకుండా పోయాడు. రేప్ కేస్ ముద్ర పడడంతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. 2016 నూతన సంవత్సర వేడుకలను గర్ల్ ఫ్రెండ్ తో ఘనంగా జరుపుకున్న కొన్ని క్షణాల తర్వాత అతడు అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలం రేపింది. రేప్ కేసు నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో అదృశ్యం కావడంతో అతని తల్లిదండ్రులు విచారంలో మునిగిపోయారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ లో ప్రియురాలు రజనీ రాథోడ్ తో పార్టీ చేసుకుని ముంబైకి తిరిగి వస్తూ అతడు కనిపించకుండాపోయాడు. అప్పటి నుంచి అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎవరో ఫ్రెండ్ ను కలవడానికని వెళ్లి అదృశ్యమైనట్టుగా తెలుస్తోందని విచారణ అధికారి జయవంత్ పాడ్వి తెలిపారు. అయితే అత్యాచార ఆరోపణల నేపథ్యంలో అతనికి అవకాశాలు బాగా తగ్గి పోవడంతో డిప్రెషన్ కు లోనయ్యాడని ప్రియురాలు రజని చెప్పిందన్నారు. విశాల్ తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు అన్ని కోణాల్లో కేసులు దర్యాప్తు చేపట్టారు.
మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'టాంగో చార్లీ', 'చాందిని బార్' తదితర చిత్రాలతోపాటు, టీవీ సీరియల్స్ విశాల్ థక్కర్ నటించాడు. గత ఏడాది అక్టోబర్ లో సహనటిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలను ఎదుర్కొన్నాడు. సహజీవనం చేసి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఆమె కేసు పెట్టింది. అనంతరం ఇద్దరూ రాజీపడడంతో ఆమె కేసు ఉపసంహరించుకుంది.