కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరవకముందే ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో నైట్‌షిఫ్టులో ఉన్న నర్సు వేధింపులను ఎదుర్కోవడం కలకలం రేపుతోంది.
వివరాలు.. బీర్భం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఛోటోచక్ గ్రామానికి చెందిన అబ్బాస్ ఉద్దిన్ అనే వ్యక్తికి జ్వరం రావటంతో అతడిని కుటుంబసభ్యులు నిన్న రాత్రి 8.30 గంటలకు హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఆ వ్యక్తిని పరీక్షించిన డాక్టర్లు సెలైన్ ఎక్కించడం కోసం వార్డుకు తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళా నర్సు రోగికి సెలైన్ బాటిల్ ఎక్కిస్తుండగా అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె హాస్పిటల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
సెలైన్ ఎక్కిస్తున్న సమయంలో ఆ వ్యక్తి.. తనను అభ్యంతరకంగా తాకడంతో పాటు అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు నర్సు ఆరోపించారు. ఆ రోగి అసభ్య ప్రవర్తనతో తాను భయభ్రాంతులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హాస్పిటల్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ చేరుకున్న ఇలంబజార్ పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
ఇటీవల కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్‌లో చోటు చేసుకున్న హత్యాచార ఘటన తర్వాత వైద్యులు, సిబ్బంది నైట్ షిఫ్ట్‌లో పనిచేయడానికి వెనకాడుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌కి ఇటీవల పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై బెంగాల్‌లో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు.. డాక్టర్లు రక్షణ కోసం ఇటీవల సుప్రీం కోర్టు నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment