రేప్ కేసులో నటుడి అరెస్ట్
ముంబై: టీవీ నటిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసులో బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ను ముంబై పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు చార్కోప్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ రామచంద్ర గైక్వాడ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి, నటుడు విశాల్ థక్కర్ గత కొన్ని నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ థక్కర్ నమ్మించాడు.
తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో పాటు శారీరకంగానూ వేధింపులకు గురిచేసేవాడని ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. నిఘా పెట్టిన మూడు రోజుల అనంతరం బొరివాలీ ఏరియాలో విశాల్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. విశాల్పై 323, 376, 420, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బుధవారం నాడు నిందితుడిని బొరివాలీ కోర్టులో ప్రవేశపెడతారు. విశాల్ థక్కర్... 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'చాందినీ బార్', తదితర సినిమాల్లో నటించాడు.