అందుకే... సంగీత దర్శకునిగా మారాను!
‘‘ఎత్తయిన వృక్షాలు ఎన్ని ఉన్నా... గాలిని ప్రసరించగా వెదురు మాత్రమే వేణువైంది..కలములెన్నో పుట్టి కలలు కన్నా.... కారణజన్ముని జన్మమొక్కటే కావ్యమైంది...అతనెవరో కాదమ్మా... కృష్ణా, గోదారీ.... పుణ్యనదుల పుత్రోత్సాహం వేటూరీ...వేటూరి రాయగా పాటలెన్నయా... నన్నయా!మా సుందరరామమూర్తిని పొగడగ కవికులం పులకిస్తుందయా కన్నయా!’’
తన గురువు వేటూరిని స్తుతిస్తూ, కీర్తిస్తూ... బండారు దానయ్య కవి రాసిన చిరు కవిత ఇది. దానయ్య కవికి గురువంటే దైవం.. పాటంటే ప్రాణం.. సాహిత్యమే సర్వస్వం. కాసేపు ఆయనతో మాట్లాడితే అది అక్షర సత్యమని అంగీకరించక తప్పదు. కళాకారుడుకి ఆవేశం ఎక్కువ అంటారు. దానికి నిలువెత్త దర్పణంగా కనిపిస్తారు దానయ్య కవి. గీత రచయితగా ఇప్పటికే పలు విజయవంతమైన పాటల్ని రచించిన దానయ్య కవి సంగీత దర్శకునిగా మారారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో సంభాషణ.
ఆయన నాకు అన్నం పెట్టారు.
సంగీతం, సాహిత్యం... ఈ రెండంటే నాకు వ్యామోహం. నల్గొండ జిల్లా ఎల్లారెడ్డిగూడెంలోని ఓ పేద కుటుంబంలో పుట్టాన్నేను. కష్టాలకోర్చి పీజీ చేశాను. పిన్న వయసు నుంచి పేదరికాన్ని అనుభవించిన వాణ్ణి. అందుకే ధనార్జనే పరమావధిగా సినీరంగం వైపు అడుగుపెట్టాను. పేదవాణ్ణి అవ్వడం వల్ల నా దుస్తులు, పాదరక్షలు సరిగ్గా ఉండేవి కావు. నా దగ్గర నిలబడి మాట్లాడటానికి కూడా చాలామంది ఇష్టపడేవారు కాదు. అలాంటి నన్ను ఆదరించిన మహానుభావుడు మా గురువుగారు వేటూరి సుందరరామూర్తి. నాకు ఆయన అన్నం పెట్టారు. అవసరాలకు డబ్బులిచ్చారు. ఈ రోజు నేను తెలుగు సినిమా రచయితల సంఘంలో జీవిత సభ్యుణ్ణి. ఆ సంఘంలో నాకు సభ్యత్వం ఇప్పించింది కూడా మా గురువుగారే. నా కావ్యం ‘సిగ్గు లజ్జా’ ఖండికకు తొలి పలుకు రాసింది కూడా వేటూరిగారే. అడుగడుగునా నాకు అండగా నిలిచిన దైవం ఆయన.
నాకది గొప్ప ప్రశంస
14 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఎందరో మహానుభావులతో పనిచేశాను. అలాగే... ఎన్నో ఎదురు దెబ్బలు కూడా తిన్నాను. ఈ సినీ పాకుడురాళ్లపై జారిపడీ పైకిలేచి... చివరకు నిలదొక్కుకొని నడవడం నేర్చుకున్నాను. ఆ అనుభవాలే నన్ను సరస్సులో రాయిని చేశాయి. లేకపోతే బావిలో రాయిలా నిశ్చలంగా ఉండిపోయేవాణ్ణి. సాహిత్యంపై నాకెంత మమకారం ఉందో, సంగీతంపైకూడా అంతే ఇష్టం ఉండేది. సశాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోయినా.. ఉద్వేగాన్ని బట్టి బాణీలు కట్టగలను. ‘కత్తి’ సినిమాలో ‘నాటుకోడి కూరరా..’ పాట ట్యూన్ నాదే. దానికి ఆ సినిమా సంగీత దర్శకుడు మణిశర్మగారే సాక్ష్యం. ‘గేయ రచయితగా బిజీగా ఉండి... నీకు మ్యూజిక్ దేనికి’ అనే వాళ్లూ ఉంటారు. వారికి చెప్పేది ఒక్కటే.. ఒక విధమైన అనారోగ్యమైన వాతావరణం తెలుగు సినీ సంగీత రంగంలో ఉంది. ఒక్కో సంగీత దర్శకుడికీ ఒక్కో కోటరీ తయారైంది. దీని కారణంగా... ఏ కోటరీకి చెందని నా లాంటి వారికి అవకాశాలు తగ్గుతున్నాయి. అందుకే... నేనే సంగీత దర్శకునిగా మారాను. నా స్వీయ రచనా, సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘ఆత్మలింగం’ అనే ఆల్బమ్‌ని మొన్నామధ్య కీరవాణిగారికి అందించాను. ఆయన తన కీ-బోర్డ్‌పై నా పాటను హమ్ చేస్తూ... కెరీర్ తొలినాళ్లలో నా పాటలు ఇలాగే ఉండేవని గుర్తు చేసుకున్నారు. నాకది గొప్ప ప్రశంస.
గురువుగారి పాటకు నేను రీమిక్స్ రాశాను
‘నువ్వుంటే చాలు’ (2000) గీత రచయితగా నా తొలి సినిమా. కల్యాణ్‌రామ్ తొలి సినిమా ‘తొలి చూపులోనే’లో నేను రాసిన ‘శుక్లాంబరధరం..’ పాట ప్రశంసలతో పాటు విమర్శలను కూడా అందించింది. ఓ విధంగా నా తొలిబ్రేక్ అదే. చక్రి ఆ సినిమాకు స్వరాలందించారు. ఇక ‘విక్రమార్కుడు’లో ‘దూరంగా ఉంటావెందుకు బొమ్మ...’ పాట నా కెరీర్‌లో పెద్ద హిట్. అలాగే ‘అతనొక్కడే’లో ‘మేఘమాలా... వానచినుకై’ పాట నాకు మంచి పేరు తెచ్చింది. నా జీవితంలో మరిచిపోలేని విషయం... ‘వీర’ సినిమాకోసం ‘మామిళ్లతోట కాడ పండిస్తే’ పాట రాయడం. అది మా గురువు వేటూరిగారు ‘డ్రైవర్‌రాముడు’ సినిమాకు రాసిన పాట. దాన్ని ‘వీర’లో నా చేత రీమిక్స్ చేయించారు. మాతృకలో రెండు మూడు లైన్లు మాత్రమే ఉపయోగించి కొత్త సాహిత్యంతో ఆ పాట రాశాను.
అదే నా లక్ష్యం
‘పాషా... అందరివాడు’, ‘ఆదిత్య హీ ఈజ్ జీనియస్’, ‘సెలైన్స్ ప్లీజ్’ సినిమాలకు ప్రస్తుతం సంగీతం అందిస్తున్నాను. శ్రీకాంత్ సినిమాక్కూడా స్వరాలిందించబోతున్నా. అలాగే ప్రియమణి కథానాయికగా రూపొందుతోన్న ఓ యాక్షన్ సినిమాకు నేనే సంగీత దర్శకుణ్ణి. సాలూరి రాజేశ్వరరావు, రమేశ్‌నాయుడు, చక్రవర్తి, ఇళయరాజా దక్షిణాది సినిమాను పునీతం చేసిన సంగీత దర్శకులు. వారిలా పదికాలాల పాటు నిలిచే పాటల్ని శ్రోతలకు అందించడమే నా ముందున్న లక్ష్యం.
- బుర్రా నరసింహ