ఆ పాట విన్న ప్రతిసారీ నా మనసు కన్నీరు పెడుతుంది!
దేవిశ్రీ ప్రసాద్
ప్రేమలో పడేసిన పాట
విన్న తొలిసారే ఆ పాటతో ప్రేమలో పడిపోయాను. విన్న ప్రతిసారీ నా మనసు కన్నీరు పెట్టుకుంటూనే ఉంటుంది. కమలహాసన్ - మణిరత్నం - ఇళయరాజా వంటి హేమాహేమీలు చేసిన సినిమా ‘నాయగన్’. అందులో ‘తెన్‌పాండి సీమయిలే.. తేరోడుమ్ వీధియిలే..’ అనే పాట చాలా హాంటింగ్‌గానూ, హార్ట్ టచింగ్‌గానూ ఉంటుంది. కన్నీళ్లు ఆపుకోవడం కష్టం. విన్న ప్రతిసారీ అదే తంతు నాకు. ఈ పాట ఒక వెర్షన్ ఇళయరాజానే స్వయంగా ఆలపించారు. రెండో చరణంలో ఓ చోట ఫ్లూట్ బిట్ వస్తుంది. అసలప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఈసారి కన్నీళ్లు పెట్టుకోకూడదని ప్రతిసారీ అనుకుని విఫలమవుతుంటాను. నాకు తెలిసి అది గ్రేటెస్ట్ కంపోజిషన్.
ఫేవరెట్ సింగర్స్
మైకేల్ జాక్సన్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, చిత్ర
అభిమాన సంగీత దర్శకుడు: ఇళయరాజా
ఇష్టమైన ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్
ఇంకెవరుంటారు... మా గురువుగారు ‘మ్యాండలిన్’ శ్రీనివాస్
ప్రియమైన రాగం
ఒక్కటని చెప్పడం చాలా కష్టం. ఒక్కో రాగంలో ఒక్కో అర్థం ఉంటుంది. ఒక్కో అందం ఉంటుంది. దేని గొప్పతనం దానిదే. అయితే నాకు తెలియకుండానే నేను ఎక్కువగా అభేరి రాగంలో పాటలు చేస్తుంటాను. ఎందుకో నాకు అభేరితో ఎక్కువ అటాచ్‌మెంట్ ఉన్నట్టుంది. హ్యాపీగా ఏం చెప్పాలన్నా అభేరితో బాగా చెప్పొచ్చనిపిస్తుంది.
సంగీతం గురించి...
నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పమంటే నేను సంగీతం అనే చెబుతాను. సంగీతం సమక్షంలో ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తాను. ఆనందిస్తాను. ఈ ప్రపంచంలో మ్యూజిక్‌తో దేన్ని కంపేర్ చేయలేం.
అదో గొప్ప ప్రపంచం... అంతే!