
సంగీత చర్చల్లో... గౌతమీపుత్రుడు!
అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా పాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథాంశంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న తెలుగువారి చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవలే అట్టహాసంగా ప్రారంభమైంది. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇప్పటికే ఈ సినిమా సంగీత చర్చలు ప్రారంభమయ్యాయి’’ అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న దేవిశ్రీప్రసాద్ ఈ సంగతి ట్విట్టర్‌లో వెల్లడించారు. దేవిశ్రీ ప్రసాద్, బాలకృష్ణ కాంబినేషన్ అనగానే ఆ మధ్య వచ్చిన మంచి మ్యూజికల్ హిట్ ‘లెజెండ్’ అందరికీ గుర్తొస్తుంది. దాంతో, ఇప్పుడు ఈ చిత్ర సంగీతంపై కూడా అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.