నా కల నిజమైంది: పవన్ వడయార్
నా కల నిజమైంది: పవన్ వడయార్
Published Thu, Sep 26 2013 1:23 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM
‘‘తెలుగులో సినిమా చేయడం నా కల. అది ‘పోటుగాడు’తో నిజమైంది. ఈ సినిమా హిట్ అవుతుందని నిర్మాణ సమయంలోనే అనిపించింది. అయితే... ఇంత విజయాన్ని మాత్రం ఊహించలేదు’’ అని దర్శకుడు పవన్ వడయార్ అన్నారు. మనోజ్ కథానాయకునిగా ఆయన దర్శకత్వంలో లగడపాటి శిరీష, శ్రీధర్ నిర్మించిన ‘పోటుగాడు’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కన్నడంలో తాను తీసిన గోవిందాయనమః, గూగ్లీ చిత్రాలు మంచి విజయాలు సాధించాయని, తెలుగులో చేసిన ‘పోటుగాడు’ తనకు హ్యాట్రిక్ విజయాన్ని ఇచ్చిందని పవన్ అన్నారు. మరికొన్ని విషయాలు చెబుతూ -‘‘చిన్నప్పట్నుంచీ కథలు, నాటకాలు అంటే ఇష్టం. ఆ ఇష్టం వల్లే యూకేలో ఉద్యోగాన్ని కూడా వదిలి కన్నడ అగ్ర దర్శకుడు యోగరాజ్‌భట్ దగ్గర సహాయకునిగా చేరాను. అయితే... రెండు నెలల్లోనే కథ రాసుకుని దర్శకునిగా ఛాన్స్ కొట్టేశాను. అదే ‘గోవిందాయ నమః’. ఆ కథ ద్వారానే తెలుగులో కూడా పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.
‘‘‘గోవిందాయనమః’ కామెడీ ఎంటర్‌టైనర్. ‘గూగ్లీ’ లవ్‌స్టోరీ. తర్వాత యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయాలని ఉంది. అది కూడా అగ్రహీరోతోనే చేస్తా’’ అని చెప్పారు. నేను హీరోగా, మా గురువు యోగరాజ్‌భట్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రీతి.. గీతి.. ఇత్యాది’. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. నా కెరీర్‌లో నేను హీరోగా చేసే తొలి సినిమా, చివరి సినిమా ఇదే. ఎందుకంటే... దర్శకత్వమే నా ఊపిరి. త్వరలో బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా చేయబోతున్నాను’’అని తెలిపారు.
Advertisement