
నా కల నెరవేరింది
కలలు కనండి, వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయండి అన్న అబ్దుల్ కలాం మాటల ప్రభావం చాలా మందిపై పడిందని చెప్పవచ్చు. అలాగే సాధనతో ఏదైనా సాధ్యమేనని చాలా మంది నిరూపించారు. ఇక నటి నిత్యామీనన్ విషయానికి వస్తే ఆమె మంచి నటి అన్న విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పాత్రగా మారిపోవడం అన్నది నిత్యామీనన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. అయితే ఆమెలో చక్కని గాయని ఉన్నారన్నది చాలా మందికి తెలియదు.
ఇప్పటికే తమిళం, మలయాళం భాషలలో తన గాన ప్రతిభను బహిరంగ పరచారు. తాజాగా తను సూర్యకు జంటగా నటించిన 24 చిత్రం తెలుగు వెర్షన్‌కు పాడడం విశేషం. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీత దర్శకుడు. ఇందులో నిత్యామీనన్ లాలీజో అనే పాటను పాడారు. తమిళంలో ఇదే పాటను శక్తి శ్రీగోపాలన్‌తో పాడించారు. సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో పాడాలన్న తన కోరిక ఈ పాటతో నెరవేరిందని అన్నారు. నిజంగా ఇది తనకు దక్కిన అదృష్టంగానే భావిస్తున్నానన్నారు. మంచి అవకాశం వస్తే తమిళంలోనూ పాడాలని ఆశిస్తున్నట్లు నిత్య అన్నారు.
కాగా ఒక మలయాళ నటి తెలుగు తదితర ఇతర భాషలలో పాడడం అరుదైన విషయమే అవుతుంది. ఇంతకు ముందు నటి మమతామోహన్ దాస్ తెలుగులో పలు పాటలు పాడారన్నది గమనార్హం. నటిగా తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది భాషలన్నిటిలోనూ నటిస్తున్న నిత్యామీనన్ కన్నడంలో సుదీప్‌తో నటించిన ముడింజా ఇవనై పిడి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక తెలుగులో సందీప్ కిషన్‌కు జంటగా ఒక్క అమ్మాయి తప్ప చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో సూర్యతో నటించిన 24 చిత్రం ఆరవ తారీఖున విడుదల కానుంది.