అప్పుడు నిరాశపడలేదు... ఆ తర్వాత పొంగిపోలేదు | My favorite thing is to go to the movies that I like | Sakshi
Sakshi News home page

అప్పుడు నిరాశపడలేదు... ఆ తర్వాత పొంగిపోలేదు

Published Thu, Aug 10 2017 12:29 AM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM

అప్పుడు నిరాశపడలేదు... ఆ తర్వాత పొంగిపోలేదు

అప్పుడు నిరాశపడలేదు... ఆ తర్వాత పొంగిపోలేదు

‘‘అందాల రాక్షసి’ ఫలితం చూసి నిరాశ పడలేదు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ విజయం చూసి పొంగిపోలేదు. హిట్టూ ఫ్లాపుల గురించి ఆలోచిస్తే క్రియేటివిటీకి దూరమైపోతామని నా అభిప్రాయం. మనసుకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళ్లాలన్నదే నా అభిమతం’’ అన్నారు హను రాఘవపూడి. నితిన్, మేఘా ఆకాశ్‌ జంటగా ఆయన దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మించిన సినిమా ‘లై’. వెంకట్‌ బోయినపల్లి చిత్రసమర్పకులు. రేపు రిలీజవుతోన్న ఈ సినిమా గురించి హను చెప్పిన సంగతులు...

అబద్ధాల వల్ల ఓ యువకుడు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడనేది చిత్రకథ. అయితే... అతను చెప్పే ప్రతి అబద్ధం వెనుక ఓ నిజం దాగుంటుంది. అదే ‘లై’లో అసలు లాజిక్‌–మేజిక్‌. ప్రేక్షకులు ఆ మేజిక్‌ను క్యాచ్‌ చేస్తే... సినిమా చాలా సరదాగా సాగుతుంది. నాకు తెలిసి ప్రేమలేని కథ, సినిమా ఉండదు. కాకపోతే సినిమాను బట్టి, కథను బట్టి ఆ ప్రేమను చూపించే విధానం మారుతుంటుంది. ఈ ‘లై’ కూడా ప్రేమకథే. మంచి యాక్షన్‌ అంశాలను మేళవించి రివెంజ్‌ డ్రామా నేపథ్యంలో తీశా.

ఎప్పట్నుంచో నితిన్‌ నాతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాల మధ్య గ్యాప్‌ వచ్చినప్పుడు నా మైండ్‌లో ఓ ఐడియా వచ్చింది. వెంటనే కథ రెడీ చేశా. నితిన్‌కు చెప్పగానే నచ్చేసింది. విలన్‌ యాంగిల్‌ నుంచి సినిమా సాగుతుంది. విలన్‌ క్యారెక్టరైజేషన్‌ కూడా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే... ఆ పాత్రకు అర్జున్‌గారు అయితే బాగుంటుందనుకున్నా. నేను ఆయనకు పెద్ద అభిమానిని. కానీ, అర్జున్‌గారి దగ్గరకెళ్లి కథ చెప్పేంత ధైర్యం లేదు. సుధాకర్‌రెడ్డిగారు (నితిన్‌ తండ్రి) ఆయన దగ్గరకు తీసుకెళితే, భయపడుతూనే కథ చెప్పా. ‘కథ నచ్చింది. నేను చేస్తున్నా’ అని అర్జున్‌గారు చెప్పగానే, సిన్మా హిట్టవుతుందనే నమ్మకం వచ్చేసింది.

కథ ప్రకారం, నితిన్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా తీశాం. స్క్రీన్‌పై చూస్తే 70 కోట్ల బడ్జెట్‌ సినిమాలా ఉంటుంది. మా నిర్మాతలు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. అనిల్‌గారి ప్లానింగ్‌ సూపర్బ్‌. విజయం వచ్చాక మనం చెప్పేది చాలామంది వింటారు. కానీ, ఏం చెబుతున్నామనే దాంట్లో స్పష్టత లేదంటే, ఎప్పటికీ తప్పుల్ని సరిదిద్దుకునే ఛాన్స్‌ రాదు.

ఆర్మీ నేపథ్యంలో నానీతో ఓ స్వచ్ఛమైన ప్రేమకథ చేయబోతున్నా. దాన్ని లడఖ్‌లోనే చిత్రీకరించాలి. మే వరకు అక్కడ చిత్రీకరణ చేయలేం గనుక ఈలోపు మరో సినిమా చేయాలనుకుంటున్నా. అఖిల్‌ కోసం ఓ టిపికల్‌ సబ్జెక్ట్‌ రెడీ చేశా. మా మధ్య డిస్కషన్స్‌ కూడా జరిగాయి. కానీ, అదెప్పుడు సెట్స్‌పైకి వెళుతుందనేది చెప్పలేను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement