దుస్తులు మరచిపోయినా.. ఫోన్ మాత్రం!
న్యూఢిల్లీ:మనం ఎవరికైనా అత్యవసరంగా మెసేజ్ ను పాస్ చేయాలంటే మొబైల్ నే ప్రముఖంగా ఉపయోగిస్తూ ఉంటాం. నిత్య జీవితంలో మొబైల్ వాడకం అనేది ఒక భాగం అయిపోయింది. ఈ విషయం ఎవరూ కాదనలేని వాస్తవం. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు మన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. కాకపోతే కాస్త భిన్నంగా, తన దైన శైలిలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
'నువ్వు దుస్తులు వేసుకోవడం మరచి పోయినా ఫర్వాలేదు కానీ మొబైల్ ఫోన్ వాడటాన్ని మరచిపోకు' అంటున్నాడు. విలాసవంతమైన వస్తువుల కంటే అత్యవసరమైన వాటికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని అర్జున్ కపూర్ స్పష్టం చేస్తున్నాడు. ఊపిరి సలపని పనిలో ఉన్నా కూడా తాను మొబైల్ తో అమితమైన వినోదాన్ని పొందుతానని కపూర్ స్పష్టం చేస్తున్నాడు.
మార్కెట్ లో ఎన్నో రకాల గాడ్జెట్ లు అందుబాటులో ఉన్నా.. ఫోన్ కు మాత్రం ప్రత్యేక స్థానం ఇవ్వాలని కోరుతున్నాడు. కనీసం అతని కోసమైనా ఆ ప్రయత్నం చేయమంటున్నాడు. 'ఎక్కువ సమయం బిజీ షెడ్యూల్ తో ఉండే నా దృష్టిలో ఫోన్ అనేది నిజంగా ప్రత్యేకమైనదేనని పేర్కొన్నాడు. 'నువ్వు దుస్తులు వేసుకోవడం మరిచిపోయినా.. ఫోన్ ను మాత్రం మరిచిపోకు'అంటూ మొబైల్ పై తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే 'గుండే', 2 స్టేట్స్ చిత్రాల్లో నటించి బాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈ నటుడికి అభిమానుల ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. ఒక లక్షకు పైగా ట్విట్టర్లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న అర్జున్ ను మీ ట్విట్టర్ జర్నీ ఎలా ఉందని ప్రశ్నించగా.. ప్రపంచంలో చాలా మందితో టచ్ లో ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు.