రెండో సినిమా అగ్ని పరీక్షే!
Published Tue, Jan 21 2014 11:20 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
పెద్దగా అంచనాలేవీ లేకుండానే బాలీవుడ్‌లోకి ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ చిత్రంతో అడుగుపెట్టాడు. గుంపులో గోవిందయ్య పాత్ర కావడంతో ఈజీగానే నెట్టుకొచ్చేశాడు. సినిమా విడుదలైంది. మరీ అంత హిట్ కాకపోయినా ఫరవాలేదనిపించింది. ఆ తర్వాత రెండో చిత్రం కోసం అవకాశం వచ్చింది. అయితే ఇది మొదటి సినిమాలాంటిది కాదు. గుంపులో గోవిందయ్య పాత్ర అసలే కాదు. సోలో హీరో..! మంచిపేరొచ్చినా, చెడ్డ పేరొచ్చినా ఈ సోలో హీరోకే వస్తుంది. అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మరి ఈ అడుగులు అతని కెరీర్‌ను ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి. ... ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు..? ఇంకెవరు.. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రంలో అలియాభట్, వరుణ్ ధావన్‌తో కలిసి తెరను పంచుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా గురించి. తొలి చిత్రంలో నటించే అవకాశం 28 సంవత్సరాలకుగానీ దక్కలేదు.
ఇక రెండో చిత్రం ‘హసీ తో ఫసీ’లో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి మల్హోత్రా మాట్లాడుతూ... ‘చాలా ఆనందంగా ఉంది. అదే సమయంలో ఆందోళనగా కూడా ఉంది. ఇది నాకు అగ్ని పరీక్ష వంటిదే. ఎందుకంటే ఈ సినిమాలో నేను సోలో హీరో. ఏది చేసినా... నేనే! ఏది దక్కినా.. నాకే! అందుకే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. అయితే ఈ చిత్రం నన్ను నిరాశపర్చదనే విశ్వాసం కూడా ఉంది. ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు వందశాతం కష్టపడ్డాను. మొదటి చిత్రంలో నటించేటప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. నన్ను పరిచయం చేసిన కరణ్ నా సగం బాధ్యతలను తన భుజాలపైనే వేసుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. నా బాధ్యత చాలా పెరిగినట్లు అని పించింది. ఈ చిత్రంలో ఓ రొమాంటిక్ కామిడీ. దర్శకుడు వినీల్ మాథ్యు చాలా అందంగా తెరకెక్కించాడు. అయితే ప్రేక్షకులు ఆదరించినప్పుడే ఏ నటుడికైనా గుర్తింపు దక్కుతుంది. చూద్దాం.. రెండో పరీక్షలో నెగ్గుతానో..? లేదో...?
Advertisement
Advertisement