
నా స్టయిల్ మార్చుకున్నా!
‘‘కెరీర్ ప్రారంభంలో ‘నీ కోసం’, ‘ఆనందం’ లాంటి ప్రేమకథలు తీశాను. ఆ తర్వాత తీసినవన్నీ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్. ఎక్కువగా ఆ తరహా చిత్రాల మీదే దృష్టి పెట్టాను. అయితే, ఆ కథలను తెర మీద ఆవిష్కరించే విషయంలో ఒకే ప్యాట్రన్ ఫాలో అయ్యాను. ఒకే పంథాలో తీయడం వల్ల ప్రేక్షకులు కూడా బోర్ ఫీలయ్యారు. అందుకే, ‘బ్రూస్‌లీ’ చిత్రానికి నా స్టయిల్ మార్చుకున్నాను. ఎలాంటి కథలు ఎంచు కున్నా, ఏ పంథాలో తీసినా నాదైన శైలి వినోదం ఉంటుంది’’ అని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం చేస్తున్న ‘బ్రూస్‌లీ’ నాకు స్పెషల్. రామ్‌చరణ్‌ను, చిరంజీవిగారిని ఒకేసారి ఈ సినిమాలో డెరైక్ట్ చేసే ఛాన్స్ రావడం నా అదృష్టం.
చిరంజీవిగారు చేసిన పాత్ర కథలో భాగంగానే ఉంటుంది. ఆయన కనిపించే సన్నివేశాలు అభిమానులకు కన్నులపండగే. ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అభిమా నులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అది సస్పెన్స్. ఈ చిత్రంలో బ్రూస్‌లీ అభిమానిగా, స్టంట్‌మాస్టర్‌గా రామ్‌చరణ్ విభిన్న పాత్రలో కనిపిస్తారు. కొంత విరామం తర్వాత కోన వెంకట్, గోపీ మోహన్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. నా గత చిత్రాల్లా కాకుండా ఇందులో బ్రహ్మా నందం పాత్ర చిత్రణ కాస్త వైవిధ్యంగా ఉంటుంది’’ అని చెప్పారు.