
ఆ విషయం ఈ ముగ్గురికే తెలుసా?
ఎందుకు... ఎందుకు? ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు? ఎవరెన్ని సార్లు ప్రశ్నించినా దర్శకుడు రాజమౌళి సహా ‘బాహుబలి’ బృందం ఎవరూ సమాధానం చెప్పలేదు. సెకండ్ పార్ట్ విడుదల వరకూ వెయిట్ చేయమన్నారు. రహస్యం బయటపడకుండా రాజమౌళి అండ్ కో సక్సెస్ అయ్యారు. నిజం చెప్పాలంటే.. తండ్రీకొడుకులు రచయిత విజయేంద్రప్రసాద్, రాజమౌళిలకు మినహా మొన్నటివరకూ ‘బాహుబలి’లో నటించే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎవ్వరికీ ఎందుకు చంపాడనే విషయం తెలియదట.
ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’ షూటింగ్ జరుగుతోంది. కట్టప్ప బాహుబలిని చంపే సన్నివేశాలు తీయక తప్పని పరిస్థితి. రహస్యం బయటపడితే? షూటింగ్ చూసినోళ్లు ఎవరైనా పొరబాటున నోరు జారితే? రాజమౌళికి సందేహం వచ్చింది. దాంతో స్టూడియోలోకి ఎవ్వర్నీ అనుమతించకుండా రహస్యంగా మూడు రోజుల క్రితం ఆ సన్నివేశాలు చిత్రీకరించారట. ప్రభాస్, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, కీలక టెక్నీషియన్స్ ఒకరిద్దరికి మాత్రమే తెలుసట. ప్రేక్షకులకు ఆ రహస్యం తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వరకూ వెయిట్ చేయక తప్పదు.