‘దంగల్’ స్టార్ జైరా వసీం సినిమాల నుంచి తప్పుకొంటున్నానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నటించిన తాజా సినిమా ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొనబోనని స్పష్టం చేశారు. ఇందుకు నిర్మాతలు కూడా సమ్మతించారు. అయితే సినిమా ప్రచారం కోసమే జైరా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా ఇకపై మత విశ్వాసాలకు లోబడి ఉండేందుకే ఇండస్ట్రీని వీడుతున్నానన్న జైరా ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేన్సర్‌తో పోరాడుతున్న బెంగాల్ నటి నఫీసా అలీ కూడా జైరా నిర్ణయంపై స్పందించారు. ఆ భగవంతుడు ప్రతీ ఒక్కరికీ కలలు నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చాడు..కాబట్టి ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఈ మేరకు.. ‘ సరికొత్త నేను.. వయస్సు మీద పడి తెల్లజట్టు వచ్చింది. అయినా ఇప్పటికీ సానుకూల దృక్పథంతోనే ఉన్నా. 20 ఏళ్ల ప్రాయంలో ఎలా ఉన్నానో కూడా నాకు గుర్తుంది. ఇక నటి జైరా వసీం విషయంలో నేను చాలా ఫీలవుతున్నాను. ఏ పని చేయాలో నిర్ణయించుకునే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అదే విధంగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలు ఉంటాయి. ప్రస్తుతం యువత ఎన్నో ఒత్తిళ్లతో సతమవుతోంది. అయితే చాయిస్ తీసుకునే అవకాశం లభించినపుడు కచ్చితంగా సరైన దాన్ని ఎంచుకోవడమే మంచిది. ఎందుకంటే నేను ఇప్పటికి ఒక్కసారి గత జీవితంలోకి తొంగి చూసుకుంటే... నాన్న మాట ఎందుకు విన్నాను. నిజానికి నా మనసు మాట విని ఉంటే బాగుండేది కదా అని పశ్చాత్తాపడుతుంటాను’ అని నఫీసా అలీ తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అదే విధంగా ఈ పోస్టు కొంత మందికైనా ధైర్యాన్ని ఇస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
ఇక తనకు ఇంకా సినిమాల్లో నటించే ఓపిక ఉందని... పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తన భావోద్వేగాలను ప్రతిబింబించేందుకు తప్పక సినిమాల్లో నటిస్తానని, తన నిర్ణయాన్ని సవాలు చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. భారత్ ఒక ప్రత్యేక దేశమని.. ఇక్కడ విభజన రాజకీయాలు చెల్లవు కాబట్టి లౌకిక భావన పెంపొందించాలని సంప్రదాయవాదులకు చురకలంటించారు. కాగా బెంగాల్‌లో జన్మించిన నఫీసా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. నసీఫా తాతయ్య వాజిద్ అలీ ప్రముఖ రచయిత. ఇక ఆమె మేనత్త జైబ్-ఉన్నీసా- హమీదుల్లా స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న నసీఫా చికిత్స తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment