స్విట్జర్లాండ్లో చైతూ-పూజా సాహసాలు
మనం విజయంతో మంచి దూకుడుమీదున్న హీరో నాగచైతన్య.. స్విట్జర్లాండ్ వెళ్లి సాహసాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ 'ఒక లైలా కోసం' చిత్రం షూటింగులో ఉన్న చైతు.. తనతో కలిసి నటిస్తున్న పూజా హెగ్డేను తీసుకుని పారాగ్లైడింగ్కు వెళ్లాడట. మిస్ ఇండియా కిరీటం గెలుచుకుని అటు నుంచి నేరుగా వెండితెర మీదకు వచ్చేసిన పూజా హెగ్డే.. టాలీవుడ్లో తన మొట్టమొదటి సినిమాకు అక్కినేని అందగాడిని ఎంచుకుంది. వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న 'ఒక లైలా కోసం' స్విట్జర్లాండ్లో షూటింగ్ జరుపుకొంది. అక్కడే హీరో హీరోయిన్లు ఇద్దరూ కలిసి ఉత్సాహంగా పారాగ్లైడింగ్కు వెళ్లారట. నిజానికి పారాగ్లైడింగ్ అంటే చాలా సాహసంతో కూడుకున్న క్రీడ. తనకు ఎత్తు ప్రదేశాలకు వెళ్లాలంటే భయమని, అసలు చైతూ తనను పారాగ్లైడింగ్కు తీసుకెళ్తున్నట్లు కూడా తొలుత తెలియదని పూజా చెప్పింది. మొదట్లో చాలా భయం అనిపించినా, తర్వాత మాత్రం చాలా చాలా ఆనందంగా అనిపించిందని తెలిపింది. అంత ఎత్తు నుంచి స్విస్ అందాలను చూడటం అద్భుతంగా ఉందని పూజా హెగ్డే అంటోంది.
చైతన్య చాలా మంచి సహనటుదని, తామిద్దరం ఒకే వయసు వాళ్లం కావడంతో తమ మధ్య మాటలు కూడా చాలా సరదాగా ఉంటాయని సంబరంగా చెప్పింది. చైతు తాను అనుకునేదానికన్నా చాలా మంచి డాన్సర్ అని, కానీ తన మీద మాత్రం అతగాడికి నమ్మకం లేదని బుంగమూతి పెట్టుకుంది. షూటింగ్ సమయంలో కూడా తన ఆహారపు అలవాట్ల విషయంలో చాలా కచ్చితంగా ఉంటూ మంచి ఫిట్నెస్ పాటిస్తాడని వివరించింది.