సాహసమే శ్వాసగా సాగిపో! | Naga Chaitanya-Gautham Menon’s film gets a catchy title! | Sakshi
Sakshi News home page

సాహసమే శ్వాసగా సాగిపో!

Published Tue, Aug 25 2015 9:56 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

సాహసమే శ్వాసగా సాగిపో!

సాహసమే శ్వాసగా సాగిపో!

పాపులర్ సినిమా పాటల పల్లవుల నుంచి సినిమా టైటిల్స్ పెట్టడం దర్శకుడు గౌతమ్ మీనన్ తరచూ అనుసరించే పద్ధతి. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న సినిమాకు కూడా ఆయన ఆ బాణీనే అనుసరించారు. తమిళంలో శింబు అభినయిస్తున్న ఈ తాజా చిత్రానికి పాపులర్ పాత తమిళ పాట నుంచి తీసుకొన్న ‘అచ్చమ్ ఎన్బదు మడమయడ...’ అనే టైటిల్ ఇప్పటికే ఖరారు చేశారు. అదే స్క్రిప్ట్ తెలుగులో యువ హీరో నాగచైతన్యతో తెరకెక్కుతోంది. ఈ తెలుగు వెర్షన్‌కు తాజాగా ‘సాహసమే శ్వాసగా సాగిపో!’ అనే టైటిల్ ఖరారు చేశారు.

గతంలో గౌతమ్ మీనన్ - నాగచైతన్యల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాకు మహేశ్‌బాబు ‘ఒక్కడు’లోని ‘నువ్వేం మాయ చేశావొగానీ...’ పాటను స్ఫూర్తిగా తీసుకుని ‘ఏం మాయ చేశావే’ అనే టైటిల్ పెట్టారు. ఆ సినిమా హిట్టయిన సంగతి తెలిసిందే. అది సెంటిమెంట్‌గా తీసుకొనో ఏమో ఇప్పుడు కూడా మళ్ళీ ‘ఒక్కడు’లోని ‘సాహసం శ్వాసగా సాగిపో...’ అనే హిట్ పాట ప్రేరణతో టైటిల్ ఖరారు చేయడం గమనార్హం. ఈ సినిమా ఒక రొమాంటిక్ థ్రిల్లర్.

ఈ ప్రేమకథకు రెండు వెర్షన్స్‌లోనూ మంజిమా మోహన్ కథానాయిక. అప్పటి ‘ఏం మాయ చేశావే’ సినిమా లాగానే దీనికీ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో గౌతమ్‌కు సన్నిహితుడైన ఆస్ట్రేలియన్ కెమేరామన్ డాన్ మెక్‌కార్థర్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ తెలుగులో సంభాషణలు సమకూర్చడమే కాక, ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎం. రవీందర్‌రెడ్డి నిర్మాత.  

తెలుగు, తమిళ వెర్షన్స్ రెండింటినీ ఏకకాలంలో రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయింది. కాగా, ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు. తండ్రికి బర్త్‌డే గిఫ్ట్‌గా కుమారుడు నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు దర్శకుడు గౌతమ్ మీనన్ తెలిపారు. మిగిలిన షూటింగ్‌ను త్వరలోనే పూర్తి చేసి, దీపావళి పండుగకు సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

యువ హీరో నాగచైతన్య గత ఏడాది ఘనవిజయం సాధించిన ‘మనం’ తర్వాత మళ్ళీ సరైన హిట్ కోసం చూస్తున్నారు. ఆ మధ్య చేసిన సినిమాలు అంతగా కలిసి రాకపోవడంతో ఆయన ఈ కొత్త సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు. వరుస చూస్తుంటే, కలిసొచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో మళ్ళీ హిట్ వచ్చేలా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement