Director Gautham Menon
-
'సాహసమే శ్వాసగా సాగిపో' ట్రైలర్ రిలీజ్
తన కుమారుడు నాగచైతన్యకు అక్కినేని నాగార్జున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చైతన్య సినిమా కెరీర్ ఉజ్వలంగా సాగాలని ఆకాంక్షించారు. ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని దీవించారు. నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని అతడి తాజా చిత్రం 'సాహసమే శ్వాసగా సాగిపో' ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోరు వాడకుండా, రియల్ సౌండ్స్ వాడినట్టు నాగార్జున- వెల్లడించారు. ట్రైలర్ యూట్యూబ్ లింకును తన ట్విటర్ పేజీలో పోస్టు చేశారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. చైతన్య సరసన మంజిమా మోహన్ నటిస్తోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ తెలుగులో సంభాషణలు సమకూర్చడమే కాక, ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమిళంలో శింబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు 'అచ్చమ్ ఎన్బదు మడమయడ...' అనే టైటిల్ ఇప్పటికే ఖరారు చేశారు. -
గౌతమ్ మీనన్ కోసం రాయబారం?
తమిళసినిమా : దర్శకుడు గౌతమ్ మీనన్ కోసం నటి జ్యోతిక తన భర్త సూర్యతో రాయబారం పంపడానికి పూనుకున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. సూర్య, గౌతమ్ మీనన్లది హిట్ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. వీరి కలయికలో తెరకెక్కిన కాక్కకాక్క చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. కథ వినకుండానే సూర్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరోసారి వారణం ఆయిరం చిత్రంలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరు ఇతర చిత్రాలతో బిజీ అయిపోయారు. అలాంటిది ఆ మధ్య ఇద్దరు కలిసి ఒక చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. గౌతమ్ మీనన్ తయారు చేసిన కథ నచ్చలేదని సూర్య బహిరంగంగానే వెల్లడించి ఆ చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ తరుణలో అజిత్ ఎనన్నై అరిందాల్ చిత్రంతో గౌతమ్‌మీనన్‌కు అవకాశం ఇచ్చారు. సూర్య అంజాన్, మాస్ చిత్రాలు చేశారు. ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆడలేదు. మళ్లీ సూర్య, గౌతమ్మీనన్లను కలిపే బాధ్యతను నటి, సూర్య అర్ధాంగి జ్యోతిక తన భుజస్కంధాలపై వేసుకున్నట్లు సమాచారం. మళ్లీ సూర్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో చిత్రం రూపొందే అవకాశం లేకపోలేదు అంటున్నారు. -
సాహసమే శ్వాసగా సాగిపో!
పాపులర్ సినిమా పాటల పల్లవుల నుంచి సినిమా టైటిల్స్ పెట్టడం దర్శకుడు గౌతమ్ మీనన్ తరచూ అనుసరించే పద్ధతి. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న సినిమాకు కూడా ఆయన ఆ బాణీనే అనుసరించారు. తమిళంలో శింబు అభినయిస్తున్న ఈ తాజా చిత్రానికి పాపులర్ పాత తమిళ పాట నుంచి తీసుకొన్న ‘అచ్చమ్ ఎన్బదు మడమయడ...’ అనే టైటిల్ ఇప్పటికే ఖరారు చేశారు. అదే స్క్రిప్ట్ తెలుగులో యువ హీరో నాగచైతన్యతో తెరకెక్కుతోంది. ఈ తెలుగు వెర్షన్‌కు తాజాగా ‘సాహసమే శ్వాసగా సాగిపో!’ అనే టైటిల్ ఖరారు చేశారు. గతంలో గౌతమ్ మీనన్ - నాగచైతన్యల కాంబినేషన్లో వచ్చిన సినిమాకు మహేశ్‌బాబు ‘ఒక్కడు’లోని ‘నువ్వేం మాయ చేశావొగానీ...’ పాటను స్ఫూర్తిగా తీసుకుని ‘ఏం మాయ చేశావే’ అనే టైటిల్ పెట్టారు. ఆ సినిమా హిట్టయిన సంగతి తెలిసిందే. అది సెంటిమెంట్‌గా తీసుకొనో ఏమో ఇప్పుడు కూడా మళ్ళీ ‘ఒక్కడు’లోని ‘సాహసం శ్వాసగా సాగిపో...’ అనే హిట్ పాట ప్రేరణతో టైటిల్ ఖరారు చేయడం గమనార్హం. ఈ సినిమా ఒక రొమాంటిక్ థ్రిల్లర్. ఈ ప్రేమకథకు రెండు వెర్షన్స్‌లోనూ మంజిమా మోహన్ కథానాయిక. అప్పటి ‘ఏం మాయ చేశావే’ సినిమా లాగానే దీనికీ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో గౌతమ్‌కు సన్నిహితుడైన ఆస్ట్రేలియన్ కెమేరామన్ డాన్ మెక్కార్థర్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ తెలుగులో సంభాషణలు సమకూర్చడమే కాక, ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎం. రవీందర్‌రెడ్డి నిర్మాత. తెలుగు, తమిళ వెర్షన్స్ రెండింటినీ ఏకకాలంలో రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయింది. కాగా, ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు. తండ్రికి బర్త్‌డే గిఫ్ట్‌గా కుమారుడు నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు దర్శకుడు గౌతమ్ మీనన్ తెలిపారు. మిగిలిన షూటింగ్‌ను త్వరలోనే పూర్తి చేసి, దీపావళి పండుగకు సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. యువ హీరో నాగచైతన్య గత ఏడాది ఘనవిజయం సాధించిన ‘మనం’ తర్వాత మళ్ళీ సరైన హిట్ కోసం చూస్తున్నారు. ఆ మధ్య చేసిన సినిమాలు అంతగా కలిసి రాకపోవడంతో ఆయన ఈ కొత్త సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు. వరుస చూస్తుంటే, కలిసొచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్లో మళ్ళీ హిట్ వచ్చేలా ఉంది. -
కథను అలా రాయొద్దు
తమిళసినిమా: ‘అభిమానులను దృష్టిలో పెట్టుకుని కథ రాయవద్దు. నన్ను కథలోకి తీసుకెళ్లండి.’ అని అన్న అజిత్ వ్యక్తిత్వం నన్ను ఆశ్చర్యపరచింది అంటున్నారు దర్శకుడు గౌతమ్ మీనన్. స్టైలిష్‌గా చిత్రాలు తెరకెక్కించే తమిళ దర్శకులలో ఈయన ఒకరు. కాక్క కాక్క, వేటైయాడు విళైయాడు వంటి కమర్షియల్ ఫార్ములా హిట్ చిత్రాలను ఎన్నై తాండి వరువాయా లాంటి యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రాలు ఘన విజయాలతో కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన దర్శకుడు గౌతమ్‌మీనన్. అయితే జయాపజయాలు సహజం. వరుసగా విజయాలను చవిచూడటం సాధ్యం కాదు. అలాగని అపజయాలను అధిగమించి జయాలను పొందలేరనే చరిత్ర లేదు. నడునిశినాయగళ్, నీ దానే ఎన్ పొన్ వసంతం లాంటి చిత్రాలు గౌతమ్‌మీనన్‌ను నిరుత్సాహపరచిన మాట నిజమే. అలాంటి సమయంలో తనను తాను ఓదార్చుకుని, ధైర్యం కూడగట్టుకుని తెరపై ఆవిష్కరించిన చిత్రం ఎన్నైఅరిందాల్. అజిత్, అనుష్క, త్రిష నాయికానాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ సాయిరాం పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం నిర్మించారు. భారీ హంగులతో గురువారం ఈ చిత్రం తెరపైకి వచ్చిన సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీనన్‌తో చిన్న ఇంటర్వ్యూ. ప్రశ్న: ఎన్నై అరిందాల్ ఏ తరహా చిత్రం? జవాబు: భావోద్రేకాలతో కూడిన యాక్షన్ కథా చిత్రం. ఇంకా చెప్పాలంటే ఇటీవల మహిళలు థియేటర్లకు రావడం తగ్గిపోతోంది. అలాంటి వారిని మళ్లీ థియేటర్లకు రప్పించేవిధంగా ఎన్నై అరిందాల్ చిత్రం ఉంటుంది. చిత్రం చూసినతరువాత ప్రతి ప్రేక్షకుడు మంచి ఫీల్‌తో బయటకొస్తాడు. ప్రశ్న: ఈ చిత్రంలో కథా నాయకుడిగా అజిత్‌నే ఎంచుకోవడానికి కారణం? జవాబు: పూర్తిగా అజిత్‌ను దృష్టిలో పెట్టుకునే తయారు చేసిన కథ ఇది. కొన్ని పరాజయాలకు తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేక దృష్టి సారించి తెరకెక్కించాను. అజిత్‌తోనే ఉండి ఆయన స్టైల్, మ్యానరిజం లాంటి అందాలకు మెరుగుపెట్టి ఈ ఎన్నై అరిందాల్ చిత్రం చేశాను. ప్రశ్న: అజిత్‌లో మీకు నచ్చిన విషయం? జవాబు : నిజం చెప్పాలంటే ఆయన అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్ర కథను తయారు చేయాలని భావించాను. ఈ విషయం గురించి అజిత్ వద్ద ప్రస్తావించగా అలాగేమి వద్దు. సాధారణంగా మీరెలా కథ ఎలా సిద్ధం చేస్తారో అలానే చేసి అందులోకి నన్ను తీసుకురండి అన్నారు. ఆయన ఆలోచన ధోరణి, మర్యాద నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ప్రశ్న: ఈ చిత్రానికి రెండు క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారట? జవాబు: అలాంటిదేమిలేదు. అదంతా అసత్య ప్రచారం. నేనీ చిత్రం కోసం తీసింది ఒకే ఒక్క క్లైమాక్స్. ప్రశ్న: ఎన్నై అరిందాల్ టైటిల్ ఈగోను ఆవిష్కరించేలా ఉందే? జవాబు: ఈగో లాంటిదేమీలేదు. చిత్రం కోసం చాలా టైటిల్స్ ఆలోచించి చివరికి ఎన్నై అరిందాల్ను నిర్ణయించాం. ఈ టైటిల్ అజిత్‌కు నచ్చుతుందో లేదోనని నేను, నిర్మాత భయపడ్డాం. అయితే కథకు నప్పడంతో ఆయన ఓకే అన్నారు. ప్రశ్న: అజిత్‌తో మీకు విభేదాలన్న ప్రచారం గురించి? జవాబు: అందులో ఒక్క శాతం కూడా నిజం లేదు. అదే నిజమైతే ఈ చిత్రాన్ని పూర్తి చేయడమే సాధ్యం అయ్యేది కాదు. అయితే చిత్ర విడుదలతో జాప్యానికి పలు కారణాలు. వాటిలో చిత్రం క్వాలిటీగా ఉండాలన్నది ప్రధాన కారణం. అజిత్‌తో విభేదాలు ఏర్పడితే ఆయన ఈ చిత్రం కోసం 22 గంటల డబ్బింగ్ చెప్పేవారా? మరో విషయం ఏమిటంటే చాలా చిత్రాలకు నా శక్తిని ధారపోశాను. ఈ చిత్రానికి మాత్రం కొంచెం శ్రమించాను. ప్రశ్న: చిత్ర ట్రైలర్, టీజర్లను అర్ధరాత్రి వేళల్లో విడుదల చేసి అభిమానులను నిద్రకు దూరం చేశారనే కామెంట్‌కు మీరిచ్చే బదులు? జవాబు: నిర్మాత సాయిబాబా భక్తుడు కావడంతో చిత్ర టీజర్, ట్రైలర్లను బుధవారం ముగిసిన తరువాత గురువారం మొదలయ్యే రాత్రి 12 గంటలకు విడుదల చేయాలని భావించారు. కారణం ఇదే. అంతేకాని అభిమానులను నిద్రకు దూరం చేయాలని మాత్రం కాదు. -
వెప్పమ్ దర్శకురాలితో రాహుల్
వెప్పమ్ చిత్రంతో మెగాఫోన్ పట్టిన మహిళా దర్శకురాలు అంజనా. దర్శకుడు గౌతమ్‌మీనన్ శిష్యురాలైన ఈమె దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో నాని, నిత్యామీనన్, కార్తీక్‌కుమార్, బిందుమాధవి ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు అంజనా. ఈ చిత్రంలో రాహుల్ హీరోగా నటించనున్నారు. పల్లాండు వాళ్గ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉంటుంద ని ఆమె చెబుతున్నారు. కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించిన వణక్కం చెన్నై చిత్రం తరువాత రాహుల్ రవీంద్రన్ నటించనున్న చిత్రం ఇది. ఈ చిత్ర కథ చాలా కొత్తగా ఉందని తన పాత్ర కూడా వెరైటీగా ఉండడంతో వెంటనే నటించడానికి అంగీకరించినట్లు రాహుల్ తెలిపారు. ఎస్కాఅహ్మద్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది.