కథను అలా రాయొద్దు | special interview with director goutham minon | Sakshi
Sakshi News home page

కథను అలా రాయొద్దు

Published Fri, Feb 6 2015 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

కథను అలా రాయొద్దు

కథను అలా రాయొద్దు

తమిళసినిమా: ‘అభిమానులను దృష్టిలో పెట్టుకుని కథ రాయవద్దు. నన్ను కథలోకి తీసుకెళ్లండి.’ అని అన్న అజిత్ వ్యక్తిత్వం నన్ను ఆశ్చర్యపరచింది అంటున్నారు దర్శకుడు గౌతమ్ మీనన్. స్టైలిష్‌గా చిత్రాలు తెరకెక్కించే తమిళ దర్శకులలో ఈయన ఒకరు. కాక్క కాక్క, వేటైయాడు విళైయాడు వంటి కమర్షియల్ ఫార్ములా హిట్ చిత్రాలను ఎన్నై తాండి వరువాయా లాంటి యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రాలు ఘన విజయాలతో కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన దర్శకుడు గౌతమ్‌మీనన్. అయితే జయాపజయాలు సహజం. వరుసగా విజయాలను చవిచూడటం సాధ్యం కాదు.

అలాగని అపజయాలను అధిగమించి జయాలను పొందలేరనే చరిత్ర లేదు. నడునిశినాయగళ్, నీ దానే ఎన్ పొన్ వసంతం లాంటి చిత్రాలు గౌతమ్‌మీనన్‌ను నిరుత్సాహపరచిన మాట నిజమే. అలాంటి సమయంలో తనను తాను ఓదార్చుకుని, ధైర్యం కూడగట్టుకుని తెరపై ఆవిష్కరించిన చిత్రం ఎన్నైఅరిందాల్. అజిత్, అనుష్క, త్రిష నాయికానాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ సాయిరాం పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం నిర్మించారు. భారీ హంగులతో గురువారం ఈ చిత్రం తెరపైకి వచ్చిన సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీనన్‌తో చిన్న ఇంటర్వ్యూ.
 
ప్రశ్న:  ఎన్నై అరిందాల్ ఏ తరహా చిత్రం?
జవాబు:
భావోద్రేకాలతో కూడిన యాక్షన్ కథా చిత్రం. ఇంకా చెప్పాలంటే ఇటీవల మహిళలు థియేటర్లకు రావడం తగ్గిపోతోంది. అలాంటి వారిని మళ్లీ థియేటర్లకు రప్పించేవిధంగా ఎన్నై అరిందాల్ చిత్రం ఉంటుంది. చిత్రం చూసినతరువాత ప్రతి ప్రేక్షకుడు మంచి ఫీల్‌తో బయటకొస్తాడు.
 
ప్రశ్న: ఈ చిత్రంలో కథా నాయకుడిగా అజిత్‌నే ఎంచుకోవడానికి కారణం?
జవాబు:
పూర్తిగా అజిత్‌ను దృష్టిలో పెట్టుకునే తయారు చేసిన కథ ఇది. కొన్ని పరాజయాలకు తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేక దృష్టి సారించి తెరకెక్కించాను. అజిత్‌తోనే ఉండి ఆయన స్టైల్, మ్యానరిజం లాంటి అందాలకు మెరుగుపెట్టి ఈ ఎన్నై అరిందాల్ చిత్రం చేశాను.
 
ప్రశ్న: అజిత్‌లో మీకు నచ్చిన విషయం?
జవాబు :
నిజం చెప్పాలంటే ఆయన అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్ర కథను తయారు చేయాలని భావించాను. ఈ విషయం గురించి అజిత్ వద్ద ప్రస్తావించగా అలాగేమి వద్దు. సాధారణంగా మీరెలా కథ ఎలా సిద్ధం చేస్తారో అలానే చేసి అందులోకి నన్ను తీసుకురండి అన్నారు. ఆయన ఆలోచన ధోరణి, మర్యాద నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
 
ప్రశ్న:  ఈ చిత్రానికి రెండు క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారట?
జవాబు:
అలాంటిదేమిలేదు. అదంతా అసత్య ప్రచారం. నేనీ చిత్రం కోసం తీసింది ఒకే ఒక్క క్లైమాక్స్.
 
ప్రశ్న:  ఎన్నై అరిందాల్ టైటిల్ ఈగోను ఆవిష్కరించేలా ఉందే?
జవాబు:
ఈగో లాంటిదేమీలేదు. చిత్రం కోసం చాలా టైటిల్స్ ఆలోచించి చివరికి ఎన్నై అరిందాల్‌ను నిర్ణయించాం. ఈ టైటిల్ అజిత్‌కు నచ్చుతుందో లేదోనని నేను, నిర్మాత భయపడ్డాం. అయితే కథకు నప్పడంతో ఆయన ఓకే అన్నారు.
 
ప్రశ్న: అజిత్‌తో మీకు విభేదాలన్న ప్రచారం గురించి?
జవాబు:
అందులో ఒక్క శాతం కూడా నిజం లేదు. అదే నిజమైతే ఈ చిత్రాన్ని పూర్తి చేయడమే సాధ్యం అయ్యేది కాదు. అయితే చిత్ర విడుదలతో జాప్యానికి పలు కారణాలు. వాటిలో చిత్రం క్వాలిటీగా ఉండాలన్నది ప్రధాన కారణం. అజిత్‌తో విభేదాలు ఏర్పడితే ఆయన ఈ చిత్రం కోసం 22 గంటల డబ్బింగ్ చెప్పేవారా? మరో విషయం ఏమిటంటే చాలా చిత్రాలకు నా శక్తిని ధారపోశాను. ఈ చిత్రానికి మాత్రం కొంచెం శ్రమించాను.
 
ప్రశ్న:  చిత్ర ట్రైలర్, టీజర్లను అర్ధరాత్రి వేళల్లో విడుదల చేసి అభిమానులను నిద్రకు దూరం చేశారనే కామెంట్‌కు మీరిచ్చే బదులు?
జవాబు:
నిర్మాత సాయిబాబా భక్తుడు కావడంతో చిత్ర టీజర్, ట్రైలర్‌లను బుధవారం ముగిసిన తరువాత గురువారం మొదలయ్యే రాత్రి 12 గంటలకు విడుదల చేయాలని భావించారు. కారణం ఇదే. అంతేకాని అభిమానులను నిద్రకు దూరం చేయాలని మాత్రం కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement