అప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు- నాగార్జున
‘‘హిందీలో తెరకెక్కిన ‘విక్కీ డోనర్’ చిత్రంలో మంచి మెసేజ్ ఉంది. ఆ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ‘నరుడా.. డోనరుడా’తో చాలా రోజుల తర్వాత సుమంత్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓ చిత్రానికి సందేశం, ఎంటర్‌టైన్‌మెంట్ కుదరడం కష్టం. కానీ, ఆ రెండూ ఈ చిత్రానికి కుదిరాయి’’ అని హీరో నాగార్జున అన్నారు. సుమంత్, పల్లవీ సుభాష్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మల్లిక్‌రామ్ దర్శకత్వంలో రమా రీల్స్, ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మించిన చిత్రం ‘నరుడా.. డోనరుడా’. శ్రీచరణ్ పాకాల స్వరపరచిన ఈ చిత్రం పాటలను నాగార్జున విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ- ‘‘రొటీన్‌కు భిన్నంగా ఉండే ఇలాంటి కథ నాకొచ్చినా చేసేవాణ్ణి. ‘నమో వెంకటేశాయ’ తర్వాత కొత్త జానర్‌లో ట్రై చేద్దామని ఓ కథ విన్నా. అది ఎంత బావుందంటే, అప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు’’ అని చెప్పారు. ‘‘గోల్కొండ హైస్కూల్’ టైమ్‌లో ‘నరుడా.. డోనరుడా’ చేయమని రామ్మోహన్‌గారు చెప్పారు. ఇందులో వినోదం ఉంటుంది. ప్రేక్షకులకు బోర్ అనిపించదు. నవంబర్ 4న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని సుమంత్ అన్నారు. ‘‘ఇలాంటి కథతో ఓ చిత్రం చేయాలని నాకూ ఉంది. కానీ, అంత ధైర్యం లేదు’’ అని అఖిల్ అన్నారు. సుధీర్ పూదోట, మల్లిక్‌రామ్, హీరోలు సుశాంత్, మంచు మనోజ్, నటుడు తనికెళ్ల భరణి, నటి లక్ష్మీ మంచు తదితరులు పాల్గొన్నారు.