బాలయ్య ఇంట పెళ్లి సందడి
బాలయ్య ఇంట పెళ్లి సందడి
Published Mon, Aug 19 2013 12:55 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
నందమూరి బాలకృష్ణ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ నెల 21న బాలయ్య, వసుంధరాదేవిల రెండో కుమార్తె తేజస్విని వివాహం మతుకుమల్లి శ్రీభరత్‌తో జరగనుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో ఈ వేడుకను వైభవంగా జరపనున్నారు. అత్యంత సుందరంగా కళ్యాణ మండపాన్ని తయారు చేయిస్తున్నారు.
పలు భారీ చిత్రాలకు అద్భుతమైన సెట్స్ వేయడంతో పాటు ఇప్పటివరకు టాలీవుడ్‌లో జరిగిన చిరంజీవి తనయ సుస్మిత వివాహం, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ల వివాహానికి వీక్షకులను అబ్బురపరిచే మండపాలు తయారు చేసిన ఆనంద్‌సాయి ఈ నందమూరి ఇంటి పెళ్లికి కూడా మండపం తయారు చేస్తున్నారు. మండపం నమూనాని బాలకృష్ణ దంపతులకు ఆనంద్‌సాయి చూపించగానే ఓకే చేశారట. స్వర్ణ వర్ణంతో ఉండబోయే ఈ మండపం నీలం రంగు లైటింగ్‌తో తళతళలాడబోతోందని సమాచారం.
దాదాపు 45 రోజులుగా 175 మంది ఈ మండపాన్ని తయారు చేసే పని మీద ఉన్నారట. ఈ మండపానికి హైలైట్‌గా నిలవబోయే వాటిలో ‘హ్యాంగింగ్ వాటర్ ఫౌంటెన్స్’ ఒకటి అని వినికిడి. మామూలుగా వాటర్ ఫౌంటెన్స్ అంటేనే అందంగా ఉంటాయి. ఇక వేలాడే ఫౌంటెన్స్ అంటే సరికొత్త అనుభూతికి గురి చేయడం ఖాయం.
ఈ కళ్యాణ మండపానికి రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారట. దాదాపు పదిహేను వేలమందికి సరిపడా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఏ ఒక్కరూ అసౌకర్యానికి గురి కాకూడదనే ఆలోచనతో బాలకృష్ణ దగ్గరుండి మరీ కళ్యాణ మండపం నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారట. ‘ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్’ అనదగ్గ విధంగా ఈ మండపం ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం.
Advertisement
Advertisement