ఆ వాతావరణం నాకు నచ్చలేదు! | Nandita Swetha Interview On Seven Movie Releasing Day | Sakshi
Sakshi News home page

ఆ వాతావరణం నాకు నచ్చలేదు!

Published Fri, Jun 7 2019 8:11 AM | Last Updated on Fri, Jun 7 2019 8:29 AM

Nandita Swetha Interview On Seven Movie Releasing Day - Sakshi

నటి నయనతార చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పింది నటి నందిత. బహుభాషా నటిగా రాణిస్తున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో అట్టకత్తి చిత్రంలో కథానాయకిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఎదిర్‌నీశ్చల్‌ వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులోనూ బిజీ హీరోయిన్‌గా మారింది. కాగా ఇటీవల తెరపైకి వచ్చిన దేవి–2 చిత్రంలో ప్రభుదేవా, తమన్నాలతో కలిసి నటించింది. తాజాగా శుక్రవారం తెరపైకి రానున్న 7 చిత్రంలోనూ నటించింది. ఈ సందర్భంగా నటి నందితతో చిట్‌చాట్‌..

ప్ర: కోలీవుడ్‌లో కనిపించి చాలా కాలమైందే?
జ: నేను తమిళంతో పాటు తెలుగు, కన్నడం భాషల్లోనూ నటిస్తున్నాను. దీంతో మీకు కోలీవుడ్‌లో గ్యాప్‌ వచ్చినట్లు అనిపించవచ్చు. నా అదృష్టం ఏమోగానీ తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో నటించిన తొలి చిత్రాలు సక్సెస్‌ అయ్యాయి. తెలుగులో నటించిన ఎక్కడికి పోతావు చిన్నదానా చిత్రానికి ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నాను.

ప్ర: ఈ మూడింటిలో ఏ భాషా చిత్రాలకు ప్రాధాన్యతనిస్తున్నారు?
జ: మూడు భాషల్లోనూ తనకున్న స్థానాన్ని కాపాడుకుంటున్నాను. 2017 నుం చి గ్యాప్‌ లేకుండా తమిళం, తెలుగు, కన్నడం భాషా చిత్రాల్లో రేయింబవళ్లు నటిస్తూనే ఉన్నాను.

ప్ర: తమిళంలో మీరు నటించిన నెంజమ్‌ మరప్పదిలై, ఇడం పొరుల్‌ ఏవల్‌ చిత్రాలు ని ర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా, ఇం కా విడుదలకు నోచుకోకపోవడం గురించి?
జ: నిజం చెప్పాలంటే నెంజమ్‌ మరప్పదిలై చిత్రంలో నటిస్తున్నప్పుడు తీసుకున్న శిక్షణే తెలుగులో నటించడానికి ఎంతగానో దోహదపడింది. దర్శకుడు సెల్వరాఘవన్‌ అంతగా నటీనటుల నుంచి నటనను రాబట్టుకుంటారు. అలాంటి దర్శకుడి చిత్రాల్లో నటించే అవకా«శం మళ్లీ రావాలని కోరుకుంటాను. ఇక ఆ రెండు చిత్రాలు త్వరగా విడుదల కావాలని దేవుడిని ప్రార్థిస్తాను.

ప్ర: నటి ఐశ్వర్యరాజేష్‌తో మీ స్నేహం గురించి?
జ: కనా చిత్రంలో నటిస్తునప్పుడు మా మధ్య స్నేహం మొదలైంది. అది ఇప్పటికీ  కొనసాగుతోంది. ఏ విషయాన్నైనా ఐశ్వర్య నాతో పంచుకుంటుంది. నిజానికి దేవి–2 చిత్రంలో నటించే అవకాశం తన ద్వారానే వచ్చింది. ఇక సారి ఫోన్‌ చేసి దేవి–2 చిత్రంలో మంచి పాత్ర ఉంది నటిస్తావా? అని ఐశ్వర్యరాజేశ్‌ అడిగింది. నేను సరే అనడంతో దర్శకుడు విజయ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడమని చెప్పింది. అలా అందులో నటించాను.
 

ప్ర: నటి నయనతారను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని మీరు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లో నటిస్తున్నారా?
జ: నిజం చెప్పాలంటే నయనతార చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌. ఇకపోతే నేనెవరినీ పోటీగా భావించను. నాకు వచ్చిన అవకాశాల్లో మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తాను. అది హీరో ఓరియెంటెడ్‌ కథా చిత్రమా? హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రమా అని ఆలోచించను. పాత్ర నచ్చితే నటించి దానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను.
 

ప్ర: ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు?
జ: 7 చిత్రం తమిళం, తెలుగు భాషల్లో శుక్రవారం తెరపైకి రానుంది. తమిళంలో ఐపీసీ 375 చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటిస్తున్నాను. ఇంతకు ముందు నేను నటించిన పాత్రలన్నింటికీ భిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నాను. తెలుగులో కల్కీ చిత్రంలో ముస్లిం యువతిగా నటిస్తున్నాను. అది చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇంకా నాలుగైదు చిత్రాలు చేతిలో ఉన్నాయి.

ప్ర: మిమ్మల్ని కోలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు పా.రంజిత్‌ ఇప్పుడు బాలీవుడ్‌కు వెళుతున్నారు.ఆ చిత్రంలో మీకు అవకాశం ఇస్తారా?
జ: పా.రంజిత్‌ అట్టకత్తి చిత్రంలో నటించిన పలువురికి ఇతర చిత్రాల్లోనూ అవకాశం కల్పిస్తున్నారు. ఒక కథా పాత్రకు నటి నందిత బాగుంటుందని భావిస్తే  కచ్చితంగా అవకాశం కల్సించే దర్శకుడాయన.

ప్ర: తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో నటించారు. మలయాళంలో ఎప్పుడు నటిస్తారూ?
జ: ఈ ఏడాది చివరిలో గానీ, వచ్చే ఏడాది ప్రథమార్థంలోగానీ మలయాళంలోనూ నటిస్తాను.

ప్ర: నైట్‌ పార్టీలకు వెళతారా?
జ: ఒక్కసారి బెంగళూర్‌లో పార్టీకి వెళ్లాను. అయితే ఆ వాతావరణం నాకు నచ్చలేదు. అంతే మళ్లీ  పార్టీలకు వెళ్లలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement