
నాని హస్తవాసి మంచిది – విజయ్
‘‘ట్రైలర్ చూసి సినిమా చూడాలా? వద్దా అనే నిర్ణయానికొస్తున్నాం. సినిమాకు వెళ్లాక కథలో లీనం కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ చూడగానే సినిమాకు వెళ్లాలనుకుంటాం. ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు మేకర్స్‌కు థ్యాంక్స్’’ అని హీరో నాని అన్నారు. విజయ్ దేవరకొండ, షాలిని జంటగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా ట్రైలర్‌ను నాని రిలీజ్ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘విజయ్ నా ‘ఎవడో సుబ్రమణ్యం’తో పరిచయం అయ్యాడు.
అతడి ‘పెళ్లిచూపులు’ టీజర్‌ను, ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్‌ను నేను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రం తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లేది అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఎమోషన్స్‌తో కూడుకున్న చిత్రమిది. లొకేషన్ల ఎంపికకు చాలా టైమ్ పట్టింది. ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు సందీప్ రెడ్డి. ‘‘నాని హస్తవాసి మంచిది. ఆయన మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు చాలా బాగుందని మెచ్చుకోవడంతో మా సినిమా హిట్ అనే భరోసా వచ్చింది’’ అన్నారు విజయ్ దేవరకొండ. ప్రణయ్ రెడ్డి, షాలిని, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు పి. కిరణ్ తదితరులు పాల్గొన్నారు.