టైటిల్ : ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్)
జానర్ : రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా
తారాగణం : నాని, సాయి పల్లవి, భూమిక, రాజీవ్ కనకాల
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : వేణు శ్రీరామ్
నిర్మాత : దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, అదే ఫాంలో ఉన్న నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఎమ్‌సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్). ఓ మై ఫ్రెండ్ సినిమాతో పరిచయం అయిన దర్శకుడు వేణు శ్రీరామ్ లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఎమ్‌సీఏ అందుకుందా..? నాని, దిల్ రాజులు తమ విజయ పరంపర కొనసాగించారా..? దర‍్శకుడిగా వేణు శ్రీరామ్ విజయం సాధించాడా..?
కథ :
నాని ఎలాంటి బాధ్యత లేకుండా అన్నయ్య (రాజీవ్ కనకాల) మీద ఆధారపడి హ్యాపీగా కాలం గడిపేస్తుంటాడు. తల్లి తండ్రి లేకపోటంతో నానిని గారాబంగా పెంచుతాడు అన్న. అయితే తన అన్నకు పెళ్లి కావటంతో వదిన జ్యోతి (భూమిక) వల్ల తన అన్న తనకు దూరమయ్యాడని ఆమె మీద కోపం పెంచుకుంటాడు నాని. అందుకే దూరంగా వెళ్లి హైదరాబాద్ లో బాబాయ్, పిన్నిలతో కలిసి ఉంటాడు. కానీ ఆర్టీవో గా పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఆమెకు తోడుగా నానిని పంపిస్తాడు. ఇష్టం లేకపోయినా అన్న కోసం వదినకు తోడుగా వెళ్తాడు నాని. అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకునే పల్లవి (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్)అయితే నాని ప్రేమ విషయం తెలిసిన వదిన జ్యోతి.. పల్లవిని దూరంగా పంపిచేస్తుంది. దీంతో నాని.. వదిన మీద మరింత కోపం పెంచుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో వరంగల్ ను భయపెట్టే శివ (విజయ్) అనే వ్యక‍్తి కారణంగా నాని కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రమాదం నుంచి నాని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు..? శివ.. నాని ఫ్యామిలీ జోలికి ఎందుకు వచ్చాడు..? నానికి వదిన మీద కోపం తగ్గిందా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
పాత్రల ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ సూపర్ ఫాంలో దూసుకుపోతున్న నాని, మరోసారి ఆసక్తికరమైన పాత్రలో ఆకట్టుకున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయ్ నానిగా తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు. ఇప్పటికే నేచురల్ స్టార్ గా ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ హీరో ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్ లో తన మార్క్ చూపించాడు. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఫిదా చేసిన సాయి పల్లవి, మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటిన భూమిక మరోసారి కీలక పాత్రలో మెప్పించింది. తన సీనియారిటీతో వదిన పాత్రకు మరింత హుందాతనం తీసుకొచ్చింది.(సాక్షి రివ్యూస్) విలన్‌గా నటించిన కొత్త కుర్రాడు విజయ్ ఆకట్టుకున్నాడు. కేవలం హావభావాలతోనే విలనిజాన్నిపండించాడు. ఇతర పాత్రలో రాజీవ్ కనకాల, ప్రియదర్శి, నరేష్, ఆమని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ :
తొలి చిత్రంతో నిరాశపరిచిన దర్శకుడు వేణు శ్రీరామ్ రెండో ప్రయత్నంలో సక్సెస్ సాధించాడు. మిడిల్ క్లాస్ అబ్బాయ్ పాత్రకు నానిని ఎంపిక చేసుకొని సగం సక్సెస్ అయిన వేణు శ్రీరామ్.. కథా కథనాల్లోనూ మంచి పట్టు చూపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలతో సినిమాను ఫుల్ మీల్స్ లా రెడీ చేశాడు. ముఖ్యంగా నాని, భూమికల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హీరో, విలన్ ల మధ్య సాగే ఎత్తుకు పై ఎత్తులు థ్రిల్లింగ్ గా ఉన్నాయి. తొలి భాగాన్ని ఎంటర్ టైనింన్‌గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ను మాత్రం ఒకే మూడ్ లో కొనసాగించాడు. (సాక్షి రివ్యూస్) ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్ లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు తన స్థాయికి తగ్గ సంగీతం అందించలేదనిపిస్తుంది. ఆడియో పరవాలేదనిపించినా.. దేవీ మార్క్ ఆశించిన ఆడియన్స్ కు నేపథ్యం సంగీతం నిరాశపరుస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ప్రధాన పాత్రల నటన
ఇంటర్వెల్, క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ లేకపోవటం
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment