నేచురల్ నటన... జెంటిల్‌మన్ ప్రవర్తన...
ఏ మాటకా మాట చెప్పాలంటే బాసూ... ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలానే కనిపించడం మంచి ఆర్టిస్ట్ లక్షణం. అసలు తెరపై కనిపిస్తున్నది ఆ ఆర్టిస్టా? ఆ పాత్రా? అనే ఫీల్ వచ్చేస్తే చాలు.. ఆ ఆర్టిస్ట్ డిస్టింక్షన్‌లో పాసయినట్లే! మన హీరో నాని అలాంటోడే! ‘అష్టాచమ్మా’లో రాంబాబు పాత్ర చేస్తే అక్కడ నాని కనిపించలేదు. ‘అలా మొదలైంది’లో తెర మీద కనిపిస్తున్నది నాని అని మర్చిపోయి గౌతమ్‌నే చూశాం. ‘ఈగ’లో నాని పాత్ర చేసి, నిజమైన నానిని మర్చిపోయేలా చేశాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’లో సుబ్రమణ్యం మాత్రమే కనిపించాడు. ఇక, ‘భలే భలే మగాడివోయ్’లో మతిమరుపు ఉన్న ఓ అబ్బాయిని చూస్తున్న ఫీల్‌ను కలగజేయగలిగాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో కృష్ణ మాత్రమే కనిపించాడు.
అంత సహజంగా నటిస్తాడు కాబట్టే, ‘న్యాచురల్ స్టార్’ అనిపించుకోగలిగాడు నాని. ఇప్పుడు మరో కొత్త పాత్ర ద్వారా కనిపించనున్నాడు. ఈసారి నాని ‘జెంటిల్‌మన్’ అన్నమాట. యస్... మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటించిన తాజా చిత్రానికి ‘జెంటిల్‌మన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘జెంటిల్‌మన్’గా నాని లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పదిమంది నానిల మధ్యలో కథానాయకుడు నాని వెరైటీగా కనిపించేలా డిజైన్ చేసిన తీరు చూస్తుంటే, ఈ పాత్ర, సినిమా కూడా నానికి మరో వెరైటీ అయ్యే సూచనలున్నాయి. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ కొంత విరామం తర్వాత నిర్మిస్తున్న చిత్రం ఇది.
సురభి, నివేదా థామస్ నాయికలు. ‘‘ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. రొమాన్స్, సెంటిమెంట్, కామెడీ సమపాళ్లల్లో ఉంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని నిర్మాత తెలిపారు. మణిశర్మ స్వరపరచిన ఈ చిత్ర గీతాలను మే ద్వితీయార్ధంలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, కెమేరా: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డెరైక్టర్: కోట సురేశ్‌కుమార్.
హీరోగా నాని ఎదుగుదల చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 'అష్టాచమ్మా' నిర్మాతగా నాకూ, హీరోగా నానీకి మొదటి సినిమా. మళ్లీ ఇప్పుడు నాని-మోహనకృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ 'జెంటిల్మెన్' నాకు చాలా స్పెషల్. ఏ హీరో అయినా నటుడిగా ఎదగాలంటే వెరైటీ కథలు ఎంపిక చేసుకోవాలి. నాని సెలక్ట్ చేసుకునేవన్నీ అలానే ఉంటాయి.'
- 'అష్టాచమ్మా' నిర్మాత పి. రామ్మోహన్