రౌడీ ఫెలోగా నారా రోహిత్
చేసింది తక్కువ సినిమాలైనా నారా రోహిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకీ నటుడిగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆయన ప్రస్తుతం మూవీ మిల్స్ అండ్ సినిమా 5 సమర్పణలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. పాటల రచయిత కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రౌడీ ఫెలో’ అనే టైటిల్ని ఖరారు చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇందులో నారా రోహిత్ పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమాలో పలు విశేషాలున్నాయి. పీసీ శ్రీరామ్ శిష్యుడు అరవింద్ గాంధీ ఛాయాగ్రహణం ఓ ఎస్సెట్. అలాగే ధూమ్ 3, బర్ఫీ లాంటి చిత్రాలకు పాటలు స్వరపరచిన ప్రీతమ్ దగ్గర పని చేసిన సన్నీ ఇచ్చిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ‘ఆషికీ 2’ సినిమా పాటల ద్వారా గాయకునిగా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఆర్జిత్ సింగ్ పాడిన పాటలు మరో ఎస్సెట్. ఓ వినూత్న కథాంశంతో ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వచ్చే ఏడాది ఏప్రిల్లో వేసవి కానుకగా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రోహిత్ సరసన విశాఖాసింగ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, పోసాని, పరుచూరి వెంకటేశ్వరరావు, తాళ్లూరి రామేశ్వరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.