
ఇక ముందు అలాంటి సినిమాలు చేయను
‘‘నిజజీవితంలో నేను కొంచెం దూకుడే. అందుకే వివాదాల్లో చిక్కుకున్నాను. నన్నెవరు పట్టించుకుంటారులే అనే భావనతో తెలీకుండానే కొన్ని తప్పులు చేశాను. సినిమా వాళ్ల పట్ల ప్రజల అటెన్షన్ ఉంటుందని, ఇక ముందు బాధ్యతతో మెలగాలని తెలుసుకున్నాను’’ అని నవదీప్ చెప్పారు. నవదీప్, కలర్స్ స్వాతి జంటగా రూపొందిన చిత్రం ‘బంగారు కోడిపెట్ట’. రాజ్ పిప్పళ్ల దర్శకుడు. సునీత తాటి నిర్మాత. ఈ నెల 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నవదీప్ విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘ప్రస్తుతం ఆఫర్ చేసిన పాత్రల్ని చేస్తూ వస్తున్నాను. కథల్ని ఎంపిక చేసుకునే స్థాయి రావాలంటే నాకో కమర్షియల్ హిట్ కావాలి.
‘బంగారు కోడిపెట్ట’ ఆ లోటును తీరుస్తుందనుకుంటున్నాను. ఇందులో నా పాత్రలో భిన్న పార్శ్వాలుంటాయి. స్వాతితో నా సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు నవదీప్. ఇంకా మాట్లాడుతూ -‘‘సినిమాల ఎంపికలో తెలీకుండానే కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులే చేయకుంటే.. ఈ రోజున నా స్థానం వేరేలా ఉండేది. ఉదాహరణకు ‘బాద్‌షా’. ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రను అందులో చేశాను. నిజానికి ఆ పాత్రను నేనే చేయనవసరం లేదు. ఎవరైనా చేయొచ్చు. ఇక ముందు అలాంటి సినిమాలు చేయను’’ అని నిర్మొహమాటంగా చెప్పారు నవదీప్. ఎన్టీఆర్‌తో సినిమా నిర్మించబోతున్నారట కదా? అనడిగితే- ‘‘సినిమాలు తీసేంత స్థాయి నాకు లేదు. నా సంపాదన నా కారు, నా పబ్బులకే సరిపోవడం లేదు’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు నవదీప్.