అందుకే బోల్డ్ సీన్స్‌ పెట్టాను : ‘లవ్‌ మౌళి’ దర్శకుడు | Director Avaneendra Talk About Love Mouli Movie | Sakshi
Sakshi News home page

Love Mouli: లిప్‌లాక్‌, బోల్డ్ సీన్స్‌ కావాలని పెట్టలేదు

Jun 5 2024 5:08 PM | Updated on Jun 6 2024 11:36 AM

Director Avaneendra Talk About Love Mouli Movie

 డైరెక్టర్‌ అవనీంద్

‘సాధారణంగా ఒక కథ రాస్తున్నప్పుడు ఒకరిని ఊహించుకుంటాం. కానీ లవ్‌మౌళి కథ రాస్తున్నప్పుడు అలా ఊహించుకోలేదు. ఒక నవలలా రాసేశాను. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరినీ ఈ కథకి ఊహించుకుంటూ వచ్చా. అయితే ఆ ఫొటోలలో అప్పుడు నవదీప్ ఫొటో లేదు. అప్పుడు నవదీప్ కూడా అంత యాక్టివ్‌గా సినిమాలు చేయడం లేదు. ఓసారి నాకెందుకో నవదీప్ అయితే అనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనలన్నీ అతనిపై పెట్టి.. ఆ తర్వాత వెళ్లి కథ చెప్పా. కథ వినగానే ఎగిరి గంతేశాడు’అని అన్నాడు డైరెక్టర్‌  అవ‌నీంద్ర. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లవ్ మౌళి’. నవదీప్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని  నైరా క్రియేషన్స్  మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూన్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ అవనీంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఈ కథ అనుకున్నప్పుడు నేను ‘ఆర్ఆర్ఆర్’ రైటింగ్‌లో ఉన్నాను. నేను ఆ సినిమాకు అసోసియేట్ రైటర్‌ని. అప్పుడే మా టీమ్ అంతా నువ్వు డైరెక్ట్ చేసే సమయం ఆసన్నమైందంటూ ప్రోత్సహించారు. అయితే నేను కమర్షియల్ కథలు ఎన్నో అప్పటికే రాసేశాను. ఏ కథ రాస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తూ కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు రిఫ్రెష్ అనిపించేలా ఉండాలని అనుకున్నాను. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రాస్తున్నప్పుడే పేరలల్‌గా ఈ పాయింట్ అనుకున్నాను. ఆర్ఆర్ఆర్‌తో పాటు అప్పటికే ఓకే చేసిన కథలన్నీ పూర్తి చేసి ఈ కథపై కూర్చున్నా.

ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంతమంది లొకేషన్స్, కొంతమంది హీరోయిన్ క్యారెక్టరైజేషన్.. ఇలా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.

ఇది నా ఫస్ట్‌ సినిమా. నిజాయితీగా ఓ మంచి కథను చెప్పాలని నిర్ణయం తీసుకున్నా. రిజల్ట్ తో సంబంధం లేదు.. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా.. ఫస్ట్ సినిమా నిజాయితీగా చేశానని చెప్పుకోవడానికి ఉంటుందని అనుకున్నా.

ఈ సినిమాలో హీరోకి లో దుస్తుల్లో మందు తాగే సీన్‌ ఉంటుంది. లో దుస్తులని పబ్లిగ్గా ఆరేయడానికి సంకోచించే మైండ్ మనది. నాకున్న స్క్రీన్‌ప్లే టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని.. హీరో క్యారెక్టర్‌ ఇదని చెప్పడం కోసమే.. హీరో ఇన్నర్ దుస్తుల్లో మందు తాగడం చూపించడం జరిగింది. ఇందులో హీరోకి ఎటువంటి సెన్సిబిలిటీస్ ఉండవు. నిజంగా అలాంటి సీన్ డిస్టర్బ్‌గా అనిపిస్తే సెన్సార్ వాళ్లు చూసుకుంటారు. వైజాగ్‌లో షో‌కి 50 శాతం అమ్మాయిలే వచ్చారు. ఎవరూ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. పోస్టర్‌లో అలా అనిపిస్తుంది కానీ.. సినిమా చూశాక అందరికీ ఆ సీన్ అర్థమవుతుంది. 18ప్లస్‌కి అవసరమైన కథ ఇది.

ఇది ఫాంటసీ బేస్ స్టోరీ.. ఒక ఆర్టిస్ట్ తన కాన్వాస్ మీద ఊహా చిత్రం వేస్తే.. అందులో నుంచి ఆ అమ్మాయి బయటికి వచ్చేస్తుంది. అందుకే కొత్త హీరోయిన్లని తీసుకోవడం జరిగింది. ఆడియన్స్ కూడా నిజంగానే వచ్చేసిందనే ఫీల్ పొందాలి. ఒకవేళ తెలిసిన హీరోయిన్ అయితే.. ఆడియన్ ఆ ఫీల్ పొందలేరు. అందుకే కొత్తవాళ్లని తీసుకున్నాం.

రిలేషన్‌లో ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఈ పాయింట్ అందరికీ నచ్చుతుందని లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించాను. లస్ట్‌ కోసం కాదు లవ్‌ కోసం చేసిన సినిమా ఇది.

నా దృష్టిలో ప్రేమంటే నాకు నచ్చినట్టు ఉండమనడం కాదు.. నాకు నచ్చకపోయినా.. నిన్ను నీలా ఉండనీయడం ప్రేమ. అదే ఈ సినిమా ద్వారా చెప్పాను.

విజయేంద్ర ప్రసాద్‌గారికి ఈ కథ చెప్పినప్పుడు బూతులు తిట్టారు. ఎందుకురా నీకు ఇది. కమర్షియల్‌గా వెళ్లకపోయావ్‌ అని అన్నారు. మా ఇద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధం ఉంటుంది. నన్ను ఆయనకి దత్తపుత్రుడు అనే వారు. అంత చనువు ఉంది ఆయన దగ్గర. నా దృష్టిలో ఇది కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలు రాసిన అలవాటుతో ఈ కథ రాశాను. షూటింగ్ అయిన తర్వాత ఒక వీడియో ప్రసాద్‌గారికి చూపించాను. కీరవాణిగారికి చూపించాను.. ఆశ్చర్యపోయారు.

ఇందులో బోల్డ్ డైలాగ్స్, లిప్ లాక్స్ బోలెడన్నీ ఉంటాయి. అవన్నీ కావాలని పెట్టినవి కాదు. కథకు అవసరమై పెట్టినవే. కమర్షియల్ మీటర్ తెలిసిన వాడిని కాబట్టి.. కథ రాసుకుంటున్నప్పుడు ఈ కథతో ఆడియన్స్‌ని రంజింపచేయడానికి అవసరమైన వన్నీ చేర్చడం జరిగింది. కరోనా తర్వాత జనాలు ప్రపంచ సినిమాను చూస్తున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా ఐటమ్ సాంగ్స్ దగ్గరే ఉంది. ఈ కథకి అన్ని అలా కుదిరాయ్.

ప్రేమతో ప్రశాంతంగా లవ్ మూడ్‌లో కూర్చున్న శివుడిని మౌళి అంటారు. ఈ సినిమాకు ఆ పేరు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. అది సినిమా చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈ స్టోరీకి చాలా ప్రత్యేకత ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్టోరీని మార్చడానికి ఏం ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement