![Nawazuddin Siddiqui Tamil Film Debut With Rajinikanth - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/19/rajinikathn-simran-nawaz-759.jpg.webp?itok=DZKh28WG)
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే చాన్స్ కోసం అన్ని ఇండస్ట్రీల వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ‘కాలా’ తర్వాత రజనీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించిన నాటి నుంచి సూపర్ స్టార్‌తో జోడి కట్టే అదృష్టం ఎవరిని వరిస్తుందా అని రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. వారి ఎదురుచూపులకు సమాధానం దొరికింది.
రజనీకాంత్ సరసన నటించబోయే ఆ అదృష్టం ఒకనాటి అందాల తార సిమ్రాన్‌ను వరించింది. ఇంకా పేరు ఖరారు కానీ ఈ చిత్రంలో సిమ్రాన్ రజనీతో జత కట్టనుంది. అంతే కాక ఈ సినిమాలో మరో విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించింది. దాంతో రజనీ సినిమాలో సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్దఖీల అధికారిక ప్రవేశం కన్‌ఫామ్ అయ్యింది.
సిమ్రాన్ దక్షిణాది పరిశ్రమకు సుపరిచితురాలే. ఒకప్పుడు ఈ హీరోయిన్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితో జత కట్టారు. వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్లపాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యే తమిళ డైరెక్టర్ పొణరామ్ దర్శకత్వంలో శివకార్తికేయన్, సమంత ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సినిమా ద్వారా సిమ్రాన్ తమిళ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే ఇప్పుడు ఏకంగా రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా నవాజుద్దీన్ సిద్దిఖీకి ఇదే తొలి తమిళ చిత్రం. ఇంతవరకూ బాలీవుడ్‌కే పరిమితమయిన ఈ నటుడు ఇప్పుడు రజనీ సినిమాతో దక్షిణాదిలో అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు. ఈ వెబ్‌సిరీస్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్ గణేష్ గైతొండే పాత్రలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment