
చెన్నై: కల్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదంటారు. అలాంటిది హీరోయిన్ నయనతార ప్రేమ ఇంతకు ముందు కలకలానికి దారి తీస్తే, పెళ్లి ఇప్పుడు సంచలనానికి దారి తీస్తోంది. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ. అందరికీ అందనిది ఈ మలయాళీ భామ అని నయనను అనవచ్చనుకుంటా. గతంలో హీరో శింబు ఆమెను పొందాలనుకున్నారు. అయితే అది ప్రేమతోనే ఆగిపోయింది. ఆ తరువాత డ్యాన్స్ మాస్టర్, హీరో ప్రభుదేవాతో ప్రేమలో పడ్డారు. కానీ అది పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. ఈ రెండు సంఘటనలు నయన జీవితంలో మరచిపోలేని చేదు అనుభవాలేనని చెప్పక తప్పదు.
అయినా ఆమె చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో వృత్తిపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడి ప్రస్తుతం అగ్రనటిగా రాణిస్తున్నారు. అయిదే ఈ అమ్మడు మూడోసారి ప్రేమలో పడి మరోసారి వార్తల్లోకెక్కారు. దర్శకుడు విఘ్నేశ్‌శివ, నయనతార డీప్ లవ్‌లో ఉన్నారని చాలా కాలం నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల విఘ్నేశ్‌శివన్ పుట్టిన రోజును పురష్కరించుకుని తనతో కలిసి నయన న్యూయార్క్ వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇద్దరూ కలిసి అక్కడ తీసుకున్న ఫోటోలను వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేసి నెటిజన్లకు పని చెప్పారు. విఘ్నేశ్, నయన కలిసి ఒకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. అయినా వీరిలో ఏ ఒక్కరూ తమ ప్రేమ గురించి గానీ, సహజీవనం సాగిస్తున్న విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇక తదుపరి ఘట్టం పెళ్లి. దానికి సమయం ఆసన్నమైందనేది తాజా సమాచారం.
ప్రస్తుతం నయనతార చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో చాలా సినిమాలు హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలే. నయన నటించిన ఇమైకానోడిగళ్ చిత్రం త్వరలో విడుదలతకు సిద్ధం అవుతోంది. చక్రి తోలేటి దర్శకత్వంలో కొలైయుదీర్ కాలం చిత్రంతో పాటు ఆరమ్ తదితర చిత్రాలలో నటిస్తున్నారు. ఈ భామ తాజాగా అరివళగన్ దర్శకత్వంలో మరో హీరోయిన్ ఓరియన్‌టెడ్ చిత్రంలో నటించాడానికి అంగీకరించారు. కాగా శివకార్తీకేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి అనే చరిత్రాత్మక చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే విఘ్నేకశ్‌శివన్‌తో పెళ్లికి రెడీ అవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తాజాగా ప్రచారం హల్‌చల్ చేస్తోంది.