సాక్షి, చెన్నై: మొదట్లో ఒక్క అవకాశం అన్న వాళ్లే ఆ తర్వాత ఒక్క విజయం కోసం ఎదురుచూస్తారు. సినిమా మంచిగా విజయం సాదిస్తే చాలు పారితోషికాలను భారీగా పెంచేస్తారు. ఈ విషయంలో ఏ హీరో, హీరోయిన అతీతం కాదు. అలా అగ్రహీరోయిన్‌లుగా రాణిస్తున్న నయనతార, అనుష్కల నుంచి ఇటీవలే రేసులో నిలబడిన రకుల్‌ప్రీత్ సింగ్‌ల వరకూ తమ పారితోషికాలను పెంచేశారు.
నయనతార
మొదట్లో లక్షల్లో పారితోషికం తీసుకున్న నటి నయనతార. రజనీకాంత్‌తో నటించిన చంద్రముఖి చిత్రం విజయంతో తన పారితోషికాన్ని వరుసగా పెంచుకుంటూ పోతోంది. కమర్శియల్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో రూ. కోటి వరకూ పుచ్చుకుంది. ఆ తర్వాత నానూరౌడీదాన్, హీరోయిన్ ఓరియెంటెడ చిత్రం మాయ వంటి చిత్రాల విజయాలతో రూ. 3 కోట్లు డిమాండ్ చేసింది. ఇమైకా నోడిగళ్ చిత్రానికి రూ.3 కోట్లు పుచ్చుకున్నట్లు అధికారిక సమాచారం. ఆ తర్వాత అరమ్ సినిమా నయనతార స్థాయిని మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను చిత్రాలకు పైనే ఉన్నాయి. తాజాగా అజిత్‌కు జంటగా నటించిన విశ్వాసం చిత్రానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.
అదే వరుసలో అనుష్క
అనుష్కకు అరుంధతి చిత్రం ఒక ల్యాండ్ మార్క్‌గా నిలిచింది. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు వచ్చి పడడంతో అనుష్క పారితోషికాన్ని పెంచేసింది. బాహుబలి సిరీస్ చిత్రాల విజయంతో తన పారితోషికాన్ని రూ. 4 కోట్లకు పెంచినట్లు సినీ వర్గాల సమాచారం. తాజాగా భాగమతి విజయబాటలో పయనిస్తుండడంతో ఆమె నయనతారకు దీటుగా రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్.
అదే బాటలోనే మిగతా హీరోయిన్లు..!
అదేబాటలో మరికొంత మంది హీరోయిన్లు పయనిస్తున్నట్లు సమాచారం. ఇటీవల తమిళంలో వివేగం, మెర్శల్, తెలుగులో ఖైదీనంబర్ 150, నేనేరాజు నేనే మంత్రి చిత్రాల విజయంతో హీరోయిన్ కాజల్ అగ్వాల్ తన పారితోసికాన్ని రూ. ఒకటిన్నర నుంచి రూ. 2 కోట్లకు పెంచేసిందట. అదే విధంగా త్రిష కోటిన్నర నుంచి రూ. 2 కోట్లకు, వివాహానంతరం హీరోయిన్‌గా బిజీగా నటిస్తున్న నటి సమంత రూ. 2 కోట్లు తీసుకుంటున్నారు.
కోలీవుడ్‌లో హిట్ కోసం ఎదురుచూసిన నటి రకుల్ ప్రీత్‌సింగ్ కూడా కార్తీతో నటించిన ధీరన్ ఒండ్రు చిత్రం విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడి పారితోషికానికి కాళ్లొచ్చేశాయి. ఆమె రూ. కోటిన్నర డిమాండ్ చేస్తోంది. అదే విధంగా చాలా తక్కువ సమయంలోనే స్టార్ నటిగా ఎదుగుతున్న హీరోయిన్ కీర్తిసురేశ్. బహుబాషా నటిగా రాణిస్తూ రూ. 2 కోట్లు డిమాండ చేస్తోందని సమాచారం. సంచలన నటి అమలాపాల్ తానేమీ తక్కువ కాదని రూ. 2 కోట్లు పారితోషికం కావాలంటోందట.
ఇటీవల హీరోయిన్ కథా చిత్రాలు వరసగా సక్సెస్ బాటపట్టడం, అవి హీరో చిత్రాలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సాధించడం గమనార్హం, హీరోల చిత్రాల బడ్జేట్ కంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు తక్కువ అవుతుంది. దీంతో దర్శక నిర్మాతలు ఆ తరహా చిత్రలపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. తమ చిత్రాలు లాభాలను తెచ్చి పెడడంతో హీరోయిన్లు పారితోషికాలను పెంచేస్తున్నారనేది సినీ గణితవేత్తల మాట. అందుకే వీరి డేట్స్ కాస్ట్‌లీ గురూ అంటున్నారు సినీ వర్గాలు.
Comments
Please login to add a commentAdd a comment