లిప్ లాక్‌కు నో!
ఒక స్థాయికి చేరుకున్న తరువాత మనిషి ప్రవర్తనలో మార్పు అన్నది తథ్యం. అది ఏ రంగమైనా సరే. ముఖ్యంగా పేరు, డబ్బు పెరిగే కొద్దీ అధికార ధోరణి పెరుగుతుంది. ఇక సినిమా రంగానికి వస్తే నటీనటుల్ని ఎంపిక చేసే ముందు దర్శక నిర్మాతలు వారికి కొన్ని నిభంధనలను విధించడం పరిపాటి. వారు ఒక స్థాయికి చేరుకున్న తరువాత నిబంధనలనేవి రివర్స్ అవుతాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్లు కథల విషయాల్లో జోక్యం చేసుకోవడం, తమ పాత్రల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచనలు ఇవ్వడం లాంటివి జరుగుతుండడం సర్వసాధారణంగా మారిపోయింది.
ఇక కథానాయకిల విషయానికి వస్తే ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న నటి నయనతార దర్శక నిర్మాతలకు షరతులు విధించడంలో ముందున్నారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా విక్రమ్‌కు జంటగా నటించిన ఇరుముగన్ చిత్రం తరువాత ఈ అమ్మడి దృక్పథంలో చాలా మార్పు వచ్చిందట. ఇటీవల లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో అధికంగా నటిస్తున్న నయనతార కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.దర్శకులు చెప్పే కథలను సీన్ బై సీన్ వింటున్నారట. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే నటించడానికి పచ్చజెండా ఊపుతున్నారు. అంతే కాదు కథల్లో మార్పులు, చేర్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం.
ముఖ్యంగా ఇంతకు ముందు ఎలాబడితే అలా విచ్చలవిడిగా అందాలను ఆరబోసిన నయనతార ఇప్పుడు దర్శక నిర్మాతలకు మూడు నిబంధనలు విధిస్తున్నారు. అవేమిటంటే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించను, ఈత దుస్తులు ధరించినటించను. గ్లామరస్‌గా కనిపించను లాంటి నిబంధనలను విధిస్తున్నారట. అయినా నయనతార కాల్‌షీట్స్ కోసం దక్షిణాది దర్శక నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారన్నది గమనార్హం. ప్రస్తుతం, చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారీ కేరళ భామ.