
తమిళసినిమా: ఒక పక్క ప్రముఖ కథానాయకుడు, యువ నటుడు అన్న భేదం చూపకుండా కథ, పాత్రలను ఎంపిక చేసుకుని కమర్శియల్ చిత్రాల్లో, మరో పక్క అరమ్ వంటి యువతకు స్ఫూర్తినిచ్చే స్త్రీ ప్రధాన పాత్రా చిత్రాల్లోనూ నటిస్తూ లేడీ సూపర్‌స్టార్ పట్టాన్ని కైవసం చేసుకున్న నటి నయనతార. వ్యక్తిగత జీవితంలో ప్రేమ పేరుతో ఒకటికి మించిన సార్లు ఓడిపోయినా నటిగా ఆత్మస్థైర్యంతో ముందుకుసాగి అగ్రనటి స్థాయికి చేరుకున్న ఈ మలయాళీ భామ తాజాగా తమిళంతో పాటు తెలుగులోనూ నటిస్తూ బీజీగా గడిపేస్తున్నారు.
ముఖ్యంగా కోలీవుడ్ ఈ సంచలన నటిని అందలం ఎక్కించిందనే చెప్పాలి. ఇటీవల తను కలెక్టర్ పాత్రను ధరించిన అరమ్ ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను పొందింది. శివకార్తికేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్ చిత్రం ఈ నెల 22న తెరపైకి రానుంది. ఆ తరువాత నయనతార సీబీఐ అధికారిగా నటించిన ఇమైకానోడిగళ్ జనవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇంకా కోలైయుధీర్ కాలం, కోకో వంటి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు చేతిలో ఉన్నాయి.
తాజాగా మరో లేడీ సెంట్రిక్ పాత్రకు నయన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. గత ఏడాది కన్నడంలో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన యూ టర్న్ చిత్ర తమిళ రీమేక్‌లో నయనతార నటించడానికి రెడీ అవుతున్నారు. అక్కడ పవన్‌కుమార్ దర్శకత్వం వహించిన యూటర్న్ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కనుంది. అందులో నటి శ్రద్ధా శ్రీనాథ్ జర్నలిస్ట్ పాత్రలో నటించారు.ఆ పాత్రను తమిళంలో నయనతార నటించనున్నారు. దీన్ని ఇంతకు ముందు సైతాన్, తాజాగా సత్య చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రదీప్‌కృష్ణమూర్తి యూటర్న్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదే చిత్రం తెలుగు రీమేక్‌లో సమంత అక్కినేని నటించడానికి రెడీ అవుతున్నారన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment