నయా ప్రేమ పాఠాలు!
అనుభవం పాఠాలు నేర్పుతుంది. ఆ పాఠాలు జీవిత సత్యాలను తెలియజేస్తాయి. అలా నయనతార ప్రేమ గురించి కొన్ని సత్యాలు తెలుసుకున్నారు. ఒక హీరో, అలాగే ఒక డ్యాన్స్‌మాస్టర్ కమ్ డెరైక్టర్ కమ్ హీరోతో ఆమె ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చిన విషయం విదితమే. ఈ లవ్‌స్టోరీస్ గురించి నయనతార ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడలేదు. అయితే, ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం ప్రేమ గురించి తను తెలుసుకున్న కొన్ని విషయాలను పంచుకున్నారు. బహుశా అనుభవం నేర్పిన పాఠాలు అయ్యుండొచ్చు. అవేంటో తెలుసుకుందాం.
ప్రముఖ రచయిత విలియం షేక్స్‌పియర్ ‘ప్రేమ గుడ్డిది’ అన్నారు. కానీ, గుడ్డిగా ప్రేమించేయకూడదు. ప్రేమలో ఉన్నప్పుడు కళ్లు తెరిచి ఉంచాలి. అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాక ఆ ప్రేమ ఎంతదాకా వెళుతుంది? సజావుగానే సాగుతుందా? లేదా అనే విషయాలను గ్రహించగలగాలి. ప్రేమ ఉద్వేగపూరితమైనది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడాలనుకుంటే ఎమోషనల్ లైఫ్‌నీ, ప్రాక్టికల్ లైఫ్‌నీ బేరీజు వేసి చూసుకోవాలి. ఈ రెంటినీ ఆ వ్యక్తితో సమపాళ్లల్లో బ్యాలెన్స్ చేయగలం అనుకున్నప్పుడు పెళ్లాడాలి.
ఎవరి కోసమూ మనల్ని మనం మార్చుకోకూడదు. గతంలో నేను మారాను. కానీ, వర్కవుట్ కాలేదు. ఒక వ్యక్తి మీతో ప్రేమలో పడ్డప్పుడు మీరెలా ఉంటే అలా ప్రేమించాలి. మీలో మంచినే కాదు చెడునీ ప్రేమించగలగాలి. అప్పుడే అది బలమైన బంధం అవుతుంది. అందుకే అంటున్నా.. మీరు మీరుగా ఉండండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి మీరు మారాలని కోరుకోడు.
ఏ బంధంలో అయినా నమ్మకం ఉండాలి. అలాగని అతిగా నమ్మకూడదు. నమ్మితే మాత్రం వ్యవహారం బెడిసికొడుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తిపై నిఘా పెట్టమని నేననడంలేదు. అయితే అతని వ్యవహారం పూర్తిగా తెలుసుకోమంటున్నా. అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోమంటున్నా.
ఆడవాళ్ల స్వేచ్ఛను ఇష్టపడని మగవాణ్ణి ప్రేమించొద్దు. ఆడవాళ్లంటే గౌరవం లేని మగవాళ్లను కూడా ప్రేమించకపోవడం బెటర్. ఇవాళ ఆడవాళ్లు ఇంటికే పరిమితం కావడంలేదు. జాబ్ చేస్తున్నారు. ప్రేమ కోసమో, పెళ్లి కోసమో కెరీర్‌ను త్యాగం చేయకూడదు. ఈ భూమ్మీద ఆడవాళ్లు చాలా ప్రత్యేకం. మీలో ఏ మార్పూ కోరుకోకుండా మీ మనసత్త్వాన్ని అర్థం చేసుకుని ప్రేమించే మగవాడైతే జీవితం బాగుంటుంది.