ప్రియుడి కోసం నిర్మాతగా నయన?
కోలీవుడ్‌లో నేటి టాప్ మోస్ట్ హీరోయిన్ ఎవరంటే వచ్చే సమాధానం నయనతార అనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వ్యక్తిగతంగా పలు ఎత్తుపల్లాలను చవిచూసినా నటిగా మాత్రం సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా నంబర్‌ఒన్ స్థానంలోనే కొనసాగుతున్నారీమె. వద్దంటే అవకాశాలు అన్నట్లుగా ఉంది నయనతార పరిస్థితి. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలు. అందులో విక్రమ్‌తో ఇరుముగన్, కార్తీకి జంటగా కాష్మోరా, తెలుగులో వెంకటేశ్ సరసన బాబు బంగారం లాంటి భారీ చిత్రాలు చోటు చేసుకున్నాయి.
ఇక శింబుతో రొమాన్స్ చేసిన ఇదునమ్మఆళు, జీవాతో జత కట్టిన తిరునాళ్ చిత్రాలు నిర్మాణ కార్యక్రమలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఇటీవల తనీఒరువన్ వంటి బ్రహ్మాండమైన చిత్రాన్ని అందించిన మోహన్‌రాజా దర్శకత్వంలో యువ నటుడు శివకార్తికేయన్‌తో డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారు. ఇక్కడి వరకూ చాలా మందికి తెలిసిన విషయమే.
తాజా సమాచారం ఏమిటంటే నటుడు శివకార్తికేయన్‌తో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారట. దీనికి తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రానికి నయనతార నిర్మాత కానున్నారట. విజయ్‌సేతుపతి, నయనతార జంటగా నానూ రౌడీదాన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించి దర్శకుడు విఘ్నేశ్‌శివ ఆ తరువాత మళ్లీ చిత్రం చేయలేదు. ఆ మధ్య విజయ్‌సేతుపతి, నయనతార, త్రిషల కాంబినేషన్‌లో చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరిగింది.
ప్రస్తుతం దాని ఊసేలేదు. తాజాగా తన ప్రియుడి కోసం నయనతార నిర్మాతగా మారనున్నారనే ప్రచారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక పోతే ఇప్పటికే పలువురు తారలు నిర్మాతలుగా మారారు. నటి సమంత కూడా ఒక మలయాళ చిత్ర రీమేక్ హక్కులు కొని తమిళం, తెలుగు భాషల్లో నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారంలో ఉంది. అదే బాటలో నటి మీనా పయనించడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వరుసలో నయన చేరనుంది.