
జిల్లా కలెక్టర్ గా నయనతార..
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకునే కొద్దిమంది తారల్లో నయనతార ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో ఆమె.. బలమైన వ్యక్తిత్వమున్న కథానాయిక పాత్రల్లో నటించి మెప్పించారు. అందుకే ఇప్పటికీ నయన్ను క్రేజీ ప్యాకేజ్తో భారీ ఆఫర్లు వరిస్తున్నాయి. తాజాగా మరోసారి ఆమె ఓ తమిళ సినిమాలో బలమైన పాత్రలో కనిపించనున్నారు.
ఒక ఊరికి సంబంధించిన తాగు నీటి సమస్య ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో నయన్ జిల్లా కలెక్టర్గా దర్శనమివ్వనున్నారు. నయనతార పాత్ర సినిమాకే హైలెట్గా ఉండనుంది. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పేశారట. గోపీ నానర్ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా చెన్నైలో మొదటి షెడ్యూల్ షూటింగ్ను పూర్తిచేసుకుంది. 'కాక్కాముట్టై' సినిమాతో మెప్పించిన చిన్నారులు విఘ్నేష్, రమేష్లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రజలు ప్రస్తుతం తీవ్రంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య నేపథ్యంలో సినిమాను తెరకెక్కించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు దర్శకుడు గోపి అన్నారు. తమ ప్రయత్నం తప్పకుండా ప్రేక్షకులను ప్రభావితం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.