దక్షిణాదిలోనే అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. పారితోషికంలోనూ తన ఆధిక్యతను చాటుకుంటున్న ఈ లేడీ సూపర్‌స్టార్‌కు అవకాశాలు చేతి నిండా ఉన్నాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలాంటిది ఇప్పుడు వచ్చిన సమస్య అంతా సక్సెస్ రేటింగ్ పడిపోవడమే. ఈ విషయంలో నయనతార టైమ్ అస్సలు బాగోలేదనే చెప్పాలి.
నిజానికి ఈ సంచలన నటి సక్సెస్‌ను చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య అరమ్, కోలమావు కోకిల, ఇమైకా నొడిగళ్ వంటి చిత్రాలతో వరుసగా సక్సెస్‌లు అందుకున్న నయనతార ఆ తరువాత విజయాలకు దూరం అయ్యారు. ఇటీవల ఐరా, శివకార్తికేయన్‌తో నటించిన మిస్టర్ లోకల్ చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి.
తాజాగా ఈ బ్యూటీ నటించిన కొలైయుధీర్ కాలం చిత్రం శిరోభారంగా మారిందనే చెప్పాలి. ఈ చిత్ర నిర్మాణంలోనే జాప్యం జరిగింది. ఎట్టకేలకు పూర్తి చేసుకుని ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వరకూ వచ్చిన కొలైయుధీర్ కాలం చిత్రం ఆ వేడుకలో సీనియర్ నటుడు రాధారవి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందనే చెప్పాలి. దీనికి తోడు నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివ అది ఆగిపోయిందనుకున్న చిత్రం అని కొలైయుధీర్ కాలం గురించి చేసిన వ్యాఖ్యలు చిత్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ తరువాత సమస్య పరిష్కారం అయ్యి చిత్ర విడుదలకు సన్నాహాలు జరిగి తేదీని కూడా ప్రకటించారు.
అయితే టైటిల్ సమస్యతో చిత్ర విడుదలపై కోర్టు తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఇదంతా నటి నయనతారకు మనశ్శాంతిని కరువు చేసే సంఘటనలే. ఇలాంటి సమయంలో నయనతారకు మరో చింత పట్టుకుంది. ఇదే కొలైయుధీర్ కాలం చిత్రం హిందిలోనూ ఖామోషి పేరుతో తెరకెక్కింది. ఈ రెండు భాషలకు దర్శకుడు చక్రి తోలేటి. నయనతార పాత్ర హిందిలో తమన్నా నటించింది. ఈ చిత్రం ఇటీవల విడుదలై అపజయాన్నే చవిచూసింది.
దీంతో ఇప్పుడు కొలైయుధీర్ కాలం చిత్రం రిజల్ట్‌ను ఊహించుకుంటే నయనతారకు చెప్పలేనంత చింత పట్టుకుందట. అయితే ఆ చిత్రం గురించి కాదు నయనతార బాధ తన మార్కెట్‌కు ఎక్కడ దెబ్బ తగులుతుందోనన్నదేనట. ప్రస్తుతం ఈ అమ్మడు రజనీకాంత్‌తో దర్బార్, విజయ్‌కు జంటగా ఒక చిత్రం, శివకార్తికేయన్‌తో మరో చిత్రం చేస్తోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment