చెన్నై : నటి నయనతారను మరోసారి వెండితెరపై సీతగా చూసే అవకాశం ఉంటుందా? ఇందుకు అలాంటి అవకాశం లేకపోలేదంటున్నారు సినీ వర్గాలు. ప్రస్తుతం అగ్రతారగా వెలిగిపోతున్న నటి నయనతార. ఎన్నో విమర్శలు, అవమానాలు, అవరోధాలను అధిగమించి ఈ సంచలన నటి ఈ స్థాయికి చేరుకుందన్న విషయం తెలియందికాదు. తొలి దశలో అందాలనే నమ్ముకుని హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇప్పుడు కథానాయకి ప్రధాన పాత్రల నటిగా ఎదిగిపోయింది. ఇప్పుడు నయనతార నటించాలంటే ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉండాల్సిందే. అలాంటి స్థాయిలో ఉన్న నయనతార ఇంతకు ముందు శ్రీరామరాజ్యం అనే తెలుగు చిత్రంలో సీతగా నటించింది. అయితే ఆ పాత్రకు ఎంపికైనప్పుడు చాలా మంది విమర్శించారు. నయనతార ఏమిటి సీతమ్మ పాత్రలో నటించడం ఏమిటి? అన్న వారికి ఆ పాత్రను తనదైన అభినయంతో జీవం పోసి మాటల్తో కాకుండా చేతలతో బదులిచ్చింది.
అంతగా సీత పాత్రలో ఒదిగిపోయింది. ఆ విషయాన్ని అలా ఉంచితే నయనతారను మరోసారి సీతగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. వింటే రామాయణాన్నే వినాలి అంటారు. అంత గొప్ప పురాణ పురుషుడు శ్రీరాముడి చరితం ఆ ఇతిహాసం. రామాయణాన్ని ఎన్ని సార్లు ఎన్ని కోణాల్లో వెండితెరకెక్కించినా ప్రేక్షకులు చూసి పరవశం చెందుతూనే ఉంటారు.అలాంటి రామాయణాన్ని మరోసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్తలు ఇటీవల వింటూనే ఉన్నాం. అవును ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్, హిందీ చిత్ర నిర్మాతలు మధు మంతేనా, నమిత్ మల్హోత్రాలతో కలిసి రామాయణం ఇతిహాసాన్ని మరోసారి కమనీయంగా వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మహా కావ్యాన్ని త్రీడీ ఫార్మెట్‌లో కనువిందుగా మూడు భాగాలుగా నిర్మించనున్నారు. దీనికి బాలీవుడ్ చిత్రం దంగల్ ఫేమ్ నితేశ్ తివారి, మామ్ చిత్రం ఫేమ్ ఉద్యఅవర్ కలిసి తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దీన్ని ఒక్కో భాగాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అలా మూడు భాగాలకు రూ.1500 కోట్ల బడ్జెట్‌లో రూపొందించనున్నారన్నమాట. ఇంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కనున్న భారతీయ చిత్రం ఇదే అవుతుంది. కాగా పౌరాణిక చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రూపొందించడానికి ప్రణాళికను రచిస్తున్నారు. అయితే పలు భాషల్లో ఇది అనువాదం అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఇందులో నటించే తారాగణం గురించి చర్చలు జరుగుతున్నాయి. అందులో సీత పాత్రకు నటి నయనతారను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ వర్గాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అమ్మడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నటించడానికి కాల్‌షీట్స్ సర్దుబాటు చేయగలదా మరోసారి సీతగా మారనుందా అన్నదే చర్చనీయంగా మారింది. మూడు భాగాలుగా తెరకెక్కించనున్న ఈ రామాయణం చిత్ర తొలి భాగాన్ని 2021లో విడుదల చేయాలన్ని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment