చెన్నై : నయనతార ఈపేరిప్పుడు ఒక సంచలనం. అగ్రకధానాయకి. లేడీ సూపర్‌స్టార్. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నాయకి. ఇలా చాలా పేర్లు గడించిన నటి నయనతార. గ్లామర్ హీరోయిన్ నుంచి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల నటి స్థాయికి చేరుకుంది. అలాంటి ఈ అమ్మడు మలయాళీ అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఈ కేరళా బ్యూటీ అసలు పేరు డయానా. మరి నయనతారగా ఎలా రూపాంతరం చెందింది? ఆ క్రెడిట్ తనదే అన్నారు ఒక సీనియర్ నటి. నయనతార అయ్యా అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తరువాత గజనీ లాంటి చిత్రాల్లో రెండో హీరోయిన్‌గానూ నటించింది. ఈ అమ్మడికి చంద్రముఖి చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించే అవకాశం వచ్చింది.
ఆ చిత్రం ఘనవిజయం నయనతారను సూపర్ హీరోయిన్‌ను చేసేసింది. ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్‌ల్లో అందరు ప్రముఖ హీరోలతోనూ జత కట్టేసింది. ఒక్క కమలహాసన్‌తో మినహా. ఆ అవకాశం ఇటీవల వచ్చినా, అనివార్య కారణాల వల్ల ఆ చిత్రాన్ని అంగీకరించలేకపోయింది. ఈ బ్యూటీ తమిళంలోకి దిగుమతి అయ్యే ముందే మాతృభాషలో మనసీనక్కరే అనే చిత్రంలో నటించింది. అందులో నటుడు జయరామ్ కథానాయకుడు. సీనియర్ నటి షీలా ముఖ్య పాత్రను పోషించారు. సత్యన్ దర్శకుడు. ఆయన డయానా పేరును మార్చాలని భావించారట. అయితే ఏం పేరు పెడదామా? అన్ని ఆలోచలతో తలమునకలయ్యారట. డయానా పేరును మార్చి వెల్లడించడానికి ఒక కార్యక్రమాన్నే ఏర్పాటు చేశారట. ఆ కార్యక్రమంలో పాల్గొన్న నటి షీలా డయానాకు నయనతార అనే పేరును పెట్టారట. తార అంటే నక్షత్రం కాబట్టి సినిమాలో నయనతార ఓహో అని వెలగాలని ఆమెకు ఆ పేరును పెట్టినట్లు ఇటీవల ఒక భేటీలో నటి షీలా వెల్లడించారు. కాగా ఆమె ఏ శుభ ముహూర్తాన నయనతారకు ఆ పేరు పెట్టారో గానీ, తను భావించినట్లే ఇవాళ నయనతార దక్షిణాదిని ఏలేస్తోంది. అంతే కాదు జయాపజయాలకు అతీతంగా మారిపోయింది. ఒక పక్క ఆమె నటించిన చిత్రాలు అపజయం పొందుతున్నా, మార్కెట్ తగ్గడం కానీ, ఇమేజ్ డామేజ్ కావడం కానీ, అవకాశాలు కొరవడటం కానీ జరగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment