
నాకు గుడి కట్టొద్దు ప్లీజ్
సినీ తారలను అభిమానులు ఆరాధ్య దేవతల్లా భావిస్తారు. ఒక్కోసారి ఈ అభిమానం పరిధులు దాటి గుళ్లు కట్టే స్థాయికి వెళ్లిపోతుంది. అలా అప్పట్లో తమిళ నటి ఖుష్బూకి గుడి కట్టారు. ఆ తర్వాత సిమ్రాన్‌కి కట్టాలనుకున్నారనే వార్త వచ్చింది. అనంతరం తమిళనాడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తారల్లో నమిత ఉన్నారు. ఈ సూరత్ సుందరి కోసం అభిమానులు గుడి కట్టారనే వార్త అప్పట్లో వచ్చింది. ఇక, ఇప్పుడు నయనతార అభిమానులు ఆమెకోసం గుడి కట్టాలనుకున్నారట. ఇటీవల నయనతారను కలిసి, ఆమె అనుమతి కోరారని సమాచారం. తమకు ఆర్థిక సహాయం ఏమీ అవసరం లేదని, కేవలం గుడి కట్టడానికి అనుమతిస్తే చాలని అడిగారట. కానీ, నయనతర ఇందుకు సమ్మతించలేదని భోగట్టా. ‘మీరింత అభిమానం చూపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ, గుడి కట్టొద్దు ప్లీజ్’ అని సున్నితంగా వారి ప్రతిపాదనను నయనతార తిరస్కరించారట.