పక్కతోవ పట్టించారు
పక్కతోవ పట్టించారు
Published Thu, Oct 31 2013 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన నటి నజ్రియా నజీమ్. ఈ భామ నేరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు వచ్చింది. ఈ చిత్ర విజయంతో నజ్రియూ స్థాయిక్కసారిగా పెరిగిపోయింది. తర్వాత ఆర్యతో రాజారాణి, ధనుష్ సరసన నయ్యాండి వంటి భారీ చిత్రాల్లో మెరిసింది. ఈ కేరళ కుట్టి అతి చేష్టలకు పోయి కెరియర్‌ను నాశనం చేసుకుంటోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. నయ్యాండి చిత్రంలో తన పాత్రను డూప్‌తో అశ్లీలంగా తెరకిక్కించారని రాద్దాంతం చేసింది. విషయం పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్లింది. చివరకు నజ్రియూ అభ్యంతరం చెప్పిన సన్నివేశాలను తొలగించి నయ్యాండి చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సంఘటన ఆమె కెరియర్‌పై ప్రభావం చూపింది.
విజయ్ చిత్రం పోయే!
నటిగా ఎదుగుతున్న నజ్రియాకు కోలీవుడ్‌లో పలు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. విజయ్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేశారు. రెండవ హీరోయిన్ అవకాశం నజ్రియాను వరించిందని సమాచారం. అయితే నయ్యాండి సంఘటన తర్వాత విజయ్ చిత్రం నుంచి నజ్రియాను తొలగించినట్లు తెలిసింది. అదే విధంగా యువనటుడు జీవా సరసన నటించాల్సిన అవకాశమూ నజ్రియా చేయి దాటిపోయింది.
గుడ్డిలో మెల్ల
గుడ్డిలో మెల్ల సామెతలా నజ్రియాకు చిన్నపాటి సంతోషం. మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రంలో నజ్రియా హీరోయిన్‌గా ఎంపికైంది. కాదలిల్ సొదప్పువదు ఎప్పడి ఫేమ్ బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం హీరోహీరోయిన్లపై ఫొటో సెషన్ ఇటీవల చెన్నై నగరంలో జరిగింది. నజ్రియా ఎలాంటి షరతులూ విధించలేదని దర్శకుడు బాలాజీ మోహన్ తెలిపారు. ఫోటోసెషన్‌లోనూ యూనిట్ ఇచ్చిన దుస్తులనే ఆమె ధరించిందని పేర్కొన్నారు. నయ్యాండి చిత్ర వ్యవహారంలో పరివారమే నజ్రియాను పక్కతోవ పట్టించిందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
Advertisement
Advertisement