
కొత్త ఫోర్‌మ్యులా
సినిమా హిట్‌కు
టాలీవుడ్‌లో ఇన్నోవేటివ్ కథలకు కొత్త తరహా సినిమాలకు కరువేమో గానీ గ్లామర్‌కు లోటుంటదు. ఎప్పుడూ కొత్త హీరోయిన్లతో కళకళలాడుతుంటుంది ఇండస్ట్రీ. ఈ అందాలే మన సినిమాను రీఫ్రెష్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగు తెరపైకి అలా దూసుకొచ్చిన తారలు హెబ్బా పటేల్, నివేదా థామస్, సురభి, రష్మీ గౌతమ్. వీళ్లకు ‘ఫ్యూచర్ స్టార్స్’ అయ్యే లక్షణాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక హిట్ సినిమాకు వీళ్లే కొత్త ఫోర్‌మ్యులా.
కుమారి సూపర్
కొన్ని పాత్రలు ఒప్పుకోవాలంటే సాహసం కావాలి. అయితే మంచి పేరొస్తుంది లేకపోతే అంతే సంగతులు. ‘కుమారి 21 ఎఫ్’లో హెబ్బా పటేల్ చేసిన పాత్ర అలాంటిదే. సుకుమార్‌లాంటి దర్శకుడు తయారు చేసిన కథ కావడంతో హెబ్బా నమ్మకంగా ఈ చిత్రం ఒప్పుకుని ఉంటారు. ఒప్పుకోవడం వరకూ ఓకే.. కానీ, ‘కాంట్రవర్షియల్ క్యారెక్టర్’ అయిన కుమారి పాత్రలో నటించడం అంటే కచ్చితంగా ప్రతిభ ఉండాల్సిందే. మోడ్రన్ యాటిట్యూడ్, ఫ్రీ మూవింగ్, లిబరల్‌గా ఉండాలనుకునే లక్షణాలతో సుకుమార్ రాసుకున్న ఈ కుమారి క్యారెక్టర్‌ను అక్షరాలా రిఫ్లెక్ట్ చేసి... టైటిల్ రోల్‌ను జస్టిఫై చేశారు హెబ్బా పటేల్. చాలా హాట్‌గా కనిపించడంతో పాటు కొన్ని సన్నివేశాల్లో హార్ట్‌ని టచ్ చేసే విధంగా కూడా నటించడం హెబ్బాకి ప్లస్ అయింది. ‘అలా ఎలా’తో పరిచయమైనప్పటికీ, హెబ్బాకు కెరీర్‌కు హెల్ప్ అయింది మాత్రం ‘కుమారి 21ఎఫ్’ సినిమానే. ఈ చిత్రం తర్వాత చాలామంది హెబ్బాని కుమారి అని పిలవడం మొదలు పెట్టారంటే ఈ పాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఊహించుకోవచ్చు. ఇక, ‘ఈడోరకం ఆడోరకం’ కూడా కమర్షియల్ హిట్ కావడంతో హెబ్బాకి మరింత క్రేజ్ పెరిగింది. దాంతో అవకాశాలు కూడా పెరిగాయి. ఇప్పుడామె తెలుగు పరిశ్రమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్‌లో ఒకరు. వాస్తవానికి ఈ ముంబై బ్యూటీ ముందు ‘అధ్యక్ష’ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయిక అయ్యారు. ఆ తర్వాత ‘తిరుమణమ్ ఎనుమ్ నిక్కా’ అనే చిత్రం ద్వారా తమిళ తెరపై మెరిశారు. ఇప్పుడు తెలుగులో బిజీ కావడంతో ఇతర భాషలపై హెబ్బా పెద్దగా దృష్టి పెట్టడంలేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘మిస్టర్’ సినిమాతో పాటు నిఖిల్ కొత్త సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్న వాడా’లోనూ ఆమె కథానాయికగా నటిస్తున్నారు.
మిల్కీ బ్యూటీ!
‘ఇలాంటి స్కిన్ టోన్ కూడా ఉంటుందా?’ అని తమన్నాను మొదటిసారి చూసినవాళ్లు ఆశ్చర్యపోతారు. ముట్టుకుంటే మాసిపోయే రంగుతో చూడగానే ఆకట్టుకుంటారు కాబట్టే తమన్నాని అందరూ ‘మిల్కీ బ్యూటీ’ అంటారు. తమన్నా తర్వాత సురభిని అందరూ అలా అంటున్నారు. కొంచెం బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంటారామె. ఢిల్లీలో పుట్టి, పెరిగిన సురభి హీరోయిన్ కావాలని చిన్నప్పట్నుంచీ అనుకున్నారు. అందుకే యాక్టింగ్ నేర్చుకున్నారు. కొన్ని యాడ్స్‌కి మెడల్‌గా కూడా నటించారు. వాటి ద్వారా తమిళ దర్శక-నిర్మాతల దృష్టిలో పడ్డారు. తమిళ చిత్రం ‘ఇవన్ వేరమాదిరి’తో కథానాయికగా పరిచయమయ్యారు. ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో పాటు సురభి అంచదందాలు, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అక్కడ చేసిన ‘వేలై ఇల్లాపట్టదారి’ కూడా సురభికి మంచి గుర్తింపే తెచ్చింది. ‘జీవా’లో చేసింది అతిథి పాత్రే అయినా ఆకట్టుకోగలిగారు. ముచ్చటగా మూడు సినిమాలతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న సురభి ‘బీరువా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా సక్సెస్ ‘బీరువా’ తెరవకున్నా సురభికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ విజయంతో ఈ బ్యూటీ కెరీర్ బండి పట్టాలెక్కేసింది.. ‘అటాక్’ తెచ్చుకున్న బ్యాడ్ టాక్ వదిలేస్తే ... కొత్త సినిమా ‘జెంటిల్‌మన్’ సక్సెస్ సురభిని మళ్లీ రేసులో నిలబెట్టింది. ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ దక్షిణాది అమ్మాయిలానే అగుపించడం సురభికి ఉన్న ప్లస్ పాయింట్స్‌లో ఒకటి. మొత్తం మీద ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ యంగ్ హీరోయిన్స్‌లో సురభి పేరు కూడా చేరింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి బోల్డన్ని ఆఫర్లు వరిస్తున్నాయి. సో.. భవిష్యత్తులో ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్‌లో సురభిని చూడొచ్చు.
మరో నిత్యామీనన్!
కేరళ కుట్టిలు నటనకు కేరాఫ్ అడ్రస్ అని ఇప్పటికే అసిన్, మీరా జాస్మిన్, కల్యాణి, నిత్యామీనన్, నయనతార, సమంత తదితరులు ప్రూవ్ చేసేశారు. ఈ వరసలో నివేదా థామస్ కూడా చేరారు. ‘జెంటిల్‌మన్’ చిత్రం ద్వారా తెలుగు తెరకొచ్చిన ఈ మలబార్ బ్యూటీ ఇప్పుడు తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్. ‘ఒక్క సినిమాతోనే టాలెంట్ నిరూపించేసుకుంది’ అని నివేదాకు ప్రశంసలు వస్తున్నాయి. ఈ యువకథానాయికకు ఎప్పుడో చిన్నప్పుడే ‘భేష్’ అనిపించుకున్నారు. ‘ఉత్తర’ అనే మలయాళ చిత్రం ద్వారా బాల నటిగా పరిచయమయ్యారామె. ఆ తర్వాత ‘రిలాక్స్’ చిత్రంలో మెరిశారు. మూడో చిత్రం ‘వెరుతే ఒరు భార్య’లో హీరో జయరామ్ కూతురిగా నటించారు. ఈ చిత్రంలో బుల్లి నివేదా అద్భుతమైన నటన కనబర్చడంతో తిరుగు లేని బాలతార అయింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు తమిళంలో కూడా పలు చిత్రాల్లో చిన్ని నివేద నటించింది. ఇటీవల మలయాళ ‘దృశ్యం’ తమిళ రీమేక్ ‘పాపనాశం’లో కమల్ కూతురిగా నటించారు. కథానాయికగా మలయాళంలో నటించింది ఒకే ఒక్క సినిమాలో మాత్రమే. ఆ తర్వాత తెలుగులో ‘జెంటిల్‌మన్’ చేశారు. విశేషం ఏంటంటే... నాని ఏ సినిమాలో నటించినా నటనపరంగా తనదే డామినేషన్. కానీ, ఈ చిత్రంలో నివేదా కూడా నానీకి గట్టి సవాల్‌నే ఇచ్చారు. క్యాథరీన్ క్యారెక్టర్‌లో ఈ బ్యూటీ కనబర్చిన అభినయం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా తను ప్రేమంచిన అబ్బాయి చనిపోయాడని తెలుసుకున్న సన్నివేశంలో నివేద ఆర్థ్ర పూరిత నటన ప్రేక్షకుల కళ్లు చెమర్చేలా చేసింది. కథానాయకుడి మరణం మిస్టరీని ఛేదించే ప్రయత్నాల్లో చూపించిన నటన కూడా ఆకట్టుకుంటుంది. అందుకే మరో నిత్యామీనన్ అన్న పేరుని నివేద తెచ్చుకోగలిగారు. మొదటి సినిమాకే మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో నివేద కొన్నాళ్ల పాటు తెలుగు తెరను ఏలే అవకాశం ఉంది.
బ్యాక్ టు బిగ్ స్క్రీన్
మామూలుగా ఎవరైనా చిన్ని తెర నుంచి పెద్ద తెరకు వస్తారు. ఒక్కోసారి ఇది రివర్స్ అవుతుందనుకోండి. పెద్ద తెరకు రావడానికి చిన్ని తెర ఓ వారధిలా ఉపయోగపడతుంది. అయితే, రష్మీకి మాత్రం చిన్ని తెరపైకి రావడానికి పెద్ద తెర వారధి అయింది. ‘హోళీ’ , ‘కరెంట్’ , ‘బిందాస్’ లాంటి సినిమాల్లో నటించిన రష్మీ గౌతమ్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో చిన్నితెరకు వచ్చిన అవకాశాన్ని ఒప్పుకోక తప్పలేదు. మరి.. ‘జబర్దస్త్’ ఒప్పుకున్నప్పుడు రష్మీ తన కెరీర్‌కు ఆ షో మంచి బాట అవుతుందని ఊహించారో లేదో కానీ, ఆమె కెరీర్‌కు మాత్రం ఆ షో మంచి హెల్ప్ అయింది. రష్మి మాతృభాష ఒరియా. పుట్టింది వైజాగ్‌లో అయినప్పటికీ తెలుగు భాష తెలియదు. పట్టుదలగా తెలుగు నేర్చుకుని,యాంకర్‌గా తన సత్తా చాటుకున్నారామె. అసలు సిసలు తెలుగమ్మాయేమో అనే ఫీల్ కలిగేలాఈ రష్మి తెలుగు మాట్లాడతారు. బుల్లితెరపై ఆమె చేసిన సందడి పెద్ద తెరవాళ్లనూ ఆకట్టుకుంది. అంతే.. రష్మీకి బిగ్ స్క్రీన్ మరోసారి వెల్‌కమ్ చెప్పింది. కమ్ బ్యాక్ మూవీగా ‘గుంటూరు టాకీస్’ ఒప్పుకున్నారామె. విడుదలకు ముందే ఈ చిత్రం పోస్టర్ల ద్వారా రష్మి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇందులో రష్మి చేసిన సువర్ణ క్యారెక్టర్ యూత్ హార్ట్‌ను గిటార్ వాయించింది. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో రష్మీకి అవకాశాలు పెరిగాయి. ఈ చిత్రం రష్మీకి ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చిందంటే.. సినిమా సేలబిల్టీపరంగా రష్మి చిన్న సినిమాలకు పెద్ద ఆప్షన్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆమె నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ‘తను వచ్చెనంట’, ‘చారుశీల’, ‘అంతం’ తదితర చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలు కాకుండా రష్మి కొత్త సినిమాలు కూడా కమిట్ కానున్నారు. మొత్తం మీద సిల్వర్ స్క్రీన్ రష్మీకి చెప్పిన రెండో వెల్‌కమ్ ఆమెకు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి.