
ఆది, నిక్కీగల్రాణి చిత్రానికి శ్రీకారం
యువ నటుడు ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించనున్న తాజా చిత్రానికి మంగళవారం పూజాకార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందు ఉరుమీన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఆక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ అధినేత ఢిల్లీబాబు నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి ఏఆర్‌కే.శరవణ్ కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. పీవీ.శంకర్ చాయాగ్రహణం, నవ సంగీతదర్శకుడు దీపు సంగీతాన్ని అందిస్తున్న ఈచిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని నిర్మాత ఢిల్లీబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తనకు చిన్నతనం నుంచి సినిమా అంటే హద్దు మీరిన మోహం అన్నారు.
ఈ రంగంలో తన కంటూ ఒక స్థాయిని సాధించుకోవాలన్న కోరిక ఉరిమీన్ చిత్రం ద్వారా నెరవేరిందన్నారు. సినిమాలో దర్శకుడు, సంగీతదర్శకుడు,నటీనటులు ముఖ్యభాగం అయినా ప్రధాన బాధ్యత అన్నది నిర్మాతపైనే ఉంటుందన్నారు. ఈ రంగంలో ప్రతిభావంతులైన వారికి ఆక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ ఒక నిచ్చెనలా ఉండాలన్న భావంతోనే ఈ సంస్థను ప్రారంభించినట్లు వెల్లడించారు. అలాంటి వారికి తమ సంస్థ కచ్చితంగా ఒక మంచి ప్లాట్‌ఫామ్‌గా ఉంటుందన్నారు.అదే విధంగా ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించాలన్నదే తమ లక్ష్యం అన్నారు.