
ఇప్పుడు టైమొచ్చింది!
ఏ కాంబినేషన్ ఎప్పుడు కుదురుతుందో ఎవరూ ఊహించలేం. ఫలానా హీరోతో సినిమా చేయాలని ఓ దర్శకుడూ... ఆ దర్శకుడితో సినిమా చేయాలనీ ఆ హీరో ఎంతగా ప్రయత్నించినా ఒక్కోసారి అంత త్వరగా సెట్ కాదు. హీరో విక్రమ్ - దర్శకుడు గౌతమ్ మీనన్‌లు ఈ కోవకే వస్తారు. వీళ్లిద్దరూ ఎప్పట్నుంచో కలసి సినిమా చేయాలనుకుంటున్నారు కానీ కుదరడం లేదు. ఈసారి అంతా సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల విక్రమ్‌కి గౌతమ్ మీనన్ ఓ కథ చెప్పారట. ఆ కథ ఈ విలక్షణ హీరోకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ఈ విషయం గురించి గౌతమ్ మీనన్ మాట్లాడుతూ - ‘‘నా మొదటి సినిమా అప్పటి నుంచి విక్రమ్‌తో సినిమా చేయాలనుకుంటున్నా. మేం చాలాసార్లు కలిశాం. పలు కథల గురించి చర్చించుకున్నాం. మన ప్రయత్నాలు సఫలం కావాలంటే రైట్ టైమ్ రావాలనే ఫిలాసఫీని నమ్ముతాను. ఆ టైమ్ ఇప్పుడు వచ్చేసిందనిపిస్తోంది. విక్రమ్‌కి నేను చెప్పిన స్టోరీ ఐడియా నచ్చి, పది రోజుల్లో ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిద్దామని అన్నాడు’’ అని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే సూర్య హీరోగా గౌతమ్ ‘ధ్రువ నక్షత్రమ్’ పేరుతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ముహూర్తం జరిగినా, ఆ స్క్రిప్ట్ సినిమాగా రాలేదు. ఇప్పుడు విక్రమ్‌తో గౌతమ్ చేయనున్నది ఆ స్క్రిప్టేనని ఓ టాక్.