బిగ్‌బాస్ నాల్గవ వారంలోకి అడుగు పెట్టింది. తాజా ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఇంటిసభ్యుల చేత కెప్టెన్సీ టాస్క్ ఆడించారు. అందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టగా వారి మధ్య ఐకమత్యం కనిపించలేదు. ఎవరికి వారే ఒంటరిగా టాస్క్‌లు గెలవడానికి పోరాడారు. టాస్క్‌లో గెలుపొందిన రాహుల్‌కు పునర్నవి గోరుముద్దలు తినిపించింది. ఎత్తుకు పై ఎత్తులతో సాగిన ఈ గేమ్‌లో శ్రీముఖి రాహుల్‌పై ఫైర్ అయింది. ‘నిన్ను నమ్మి టీంలోకి తీసుకున్నా. నన్ను మోసం చేస్తే నీతో జీవితంలో మాట్లాడను’ అని రాహుల్ పై సీరియస్ అయింది. అయితే ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడిలా రాహుల్.. శ్రీముఖికి పాద నమస్కారం చేసి మరీ తన దగ్గర ఉన్న గుడ్డును కొట్టేశాడు. దీంతో తెల్లముఖం వేయడం శ్రీముఖి వంతయింది. టాస్క్ ప్రారంభంలో అమ్మాయిలు హవా చూపించినప్పటికీ చివరికి ఆట అబ్బాయిల చేతిలోకి వెళ్లిపోయింది.
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ‘నేనే రాజు-నేనే మంత్రి’ గేమ్ ఆడించారు. ఇందుకుగానూ ఇంటి సభ్యులను విక్రమపురి (రెడ్ టీమ్), సింహపురి (బ్లూ టీమ్)లుగా విడగొట్టాడు. రెడ్ టీమ్‌కు సేనాపతిగా శ్రీముఖి, బ్లూ టీమ్ సేనాపతిగా హిమజలను నియమించారు. రెడ్ టీమ్ సేనాపతి శ్రీముఖి.. అలీ, రాహుల్, మహేశ్, అషూరెడ్డిలను సైనికులుగా ఎంచుకుంది. బ్లూ టీమ్ సేనాపతి హిమజ.. వరుణ్, పునర్నవి, బాబా భాస్కర్, రవిలను సైనికులుగా సెలక్ట్ చేసుకుంటుంది. ఆట విషయానికొస్తే.. రెడ్ టీం దగ్గర ఎరుపు రంగు జెండాలు, బ్లూ టీం దగ్గర నీలం రంగు జెండాలు ఉంటాయి. రెడ్ టీం.. బ్లూ టీం రాజ్యంలో జెండాలు పాతాలి. అదే విధంగా బ్లూ టీం.. రెడ్ టీం రాజ్యంలో జెండాలను ఉంచాలి. పొరుగు రాజ్యం పాతిన జెండాలను నిర్దాక్షిణ్యంగా తీసి పాడేసే హక్కు సంబంధిత రాజ్యానికి ఉంటుంది.
బజర్ మోగగానే హోరాహోరీగా సాగిన ఈ ఆట రాను రానూ రసవత్తరంగా మారింది. మొదట జెండాల కోసం కుస్తీ పడ్డా తరువాత అందరి దృష్టి డ్రాగన్ ఎగ్స్‌పైకే వెళ్లింది. గుడ్డు సంపాదించుకున్న వారికి ప్రత్యేక ప్రయోజనాలతో పాటు నేరుగా రెండో రౌండ్‌కు వెళ్లే అవకాశం ఉండటమే ప్రధాన కారణం. ఇరు రాజ్యాల సైనికులు ఎంతసేపూ గుడ్డు మీద కన్నేయడంతో రెండు టీమ్‌లు తదుపరి లెవల్‌కు వెళ్లలేదు. ఆట ప్రారంభానికి ముందే డ్రాగన్ ఎగ్స్ సంపాదించుకున్న వితిక, రోహిణి, శివజ్యోతిలు వాటిని కాపాడుకోడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ గుడ్లను జారవిడ్చుకుని కెప్టెన్సీ టాస్క్ మధ్యలోనే తప్పుకున్నారు. ఇక రెడ్ టీం.. జెండాలు కాపాడుకున్నా, సైనికులు లేక.. బ్లూ టీమ్ అటు జెండాలు, ఇటు సైనికులు రెండూ కోల్పోవడంతో తర్వాతి లెవల్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయాయి.
వ్యూహాత్మకంగా సాగిన ఈ గేమ్‌లో చివరాఖరికి రాహుల్, రవి, అలీ రెజాలు డ్రాగన్ ఎగ్స్ దక్కించుకుని నెక్స్ట్ లెవల్‌కు వెళ్లారు. కెప్టెన్సీ టాస్క్‌లో ఈ ముగ్గురూ తలపడనున్నారు. కూల్‌గా ఉండే రవి, అతిగా ఆవేశపడే అలీ, నవ్వుతూనే ఎత్తులు వేసే రాహుల్.. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్‌గా నిలుస్తారో చూడాలి..!
Comments
Please login to add a commentAdd a comment