
హిందూ సంప్రదాయంలో వివాహం జరుగుతుండగా ప్రియాంక సోదరుడు...
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ల వివాహం జోధ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. శనివారం క్రిస్టియన్, ఆదివారం హిందూ సంప్రదాయాల్లో ఒక్కటయ్యారు ప్రియానిక్. అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇంతవరకు బయటకు రాలేదు గానీ.. వివాహ వేడుకకు సంబంధించిన పలు ఆసక్తికర సంఘటనల గురించి బీ- టౌన్‌లో వార్తలు ప్రచారమవుతున్నాయి.
ఏడు జన్మలు సరిపోవు..
‘హిందూ సంప్రదాయంలో వివాహం జరుగుతుండగా ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ దంపతులకు మంత్రాల పరమార్థాన్ని వివరిస్తున్నాడు. ఇందులో భాగంగా సప్తపది సమయంలో ఏడడుగులు వేయాలంటూ నిక్‌కు సూచించగా.. అతడు ఎంతో సంతోషంగా ప్రియాంక వేలు పట్టుకుని ముందుసాగాడు. ఈ ఏడు అడుగులు... భార్యాభర్తల ఏడు జన్మల బంధానికి సంకేతమని సిద్దార్థ్ చెప్పగానే... తాను, పిగ్గీ చాప్స్ కలిసి మరో ఏడు అడుగులు వేస్తామంటూ నిక్ కోరాడు. నిక్ మాటలు వినగానే భావోద్వేగానికి లోనైన ప్రియాంక.. తనపై భర్తకు ఉన్న ప్రేమకు మురిసిపోయి సంతోషంతో కన్నీళ్లు పెట్టింది’ అని ఓ ఆన్‌లైన్ పోర్టల్ పేర్కొంది.