
హిందీలో... హాలీవుడ్ తార
నికోల్ కిడ్‌మాన్
భారతీయ సినిమా తారలు అడపా దడపా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తుంటారు. అలాగే, అక్కడి తారలు కూడా ఇక్కడి చిత్రాల్లో అడపాదడపా నటిస్తుంటారు. ఇప్పటివరకు హిందీ చిత్రాల్లో నటించిన హాలీవుడ్ తారల జాబితా డజను పైగానే ఉంటుంది. ‘కంబక్త్ ఇష్క్’లో సిల్వెస్టర్ స్టాలెన్ నటించారు. అదే చిత్రంలో నటి డినైస్ రిచర్డ్స్ కూడా నటించారు. ‘రంగ్ దే బసంతి’లో నటుడు స్టీవెన్ మాకింటోష్, ‘లగాన్’లో నటి రాచెల్ షెల్లీ.. ఇలా కొంతమంది హాలీవుడ్ తారలు కనువిందు చేశారు.
ఇప్పుడీ జాబితాలో నటి నికోల్ కిడ్‌మాన్ చేరనున్నారని సమాచారం. అజయ్ దేవగణ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తూ, నటిస్తున్న హిందీ చిత్రం ‘శివాయ్’లో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రకు నికోల్ అయితేనే నప్పుతారని అజయ్ అనుకోవడం, ఆమెను సంప్రతించడం జరిగిందని బాలీవుడ్‌లో టాక్. ఈ చిత్రంలో నటించడానికి నికోల్ సుముఖంగానే ఉన్నారట.