
స్టార్ట్.. యాక్షన్.. కట్..!
నిత్యామీనన్ మనసు ఇప్పుడు మార్పు కోరుకుంటోందట. ఫర్ ఎ ఛేంజ్ కెమెరా ముందు కాకుండా కెమెరా వెనక ఉండాలని మనసు ఉవ్విళ్లూరుతోందట. దీన్నిబట్టి నిత్యా మనసులో ఏముందో కొంచెం గ్రహించే ఉంటారు. యస్.. ఈ మలయాళ కుట్టి మనసు ఇప్పుడు డైరెక్షన్ మీద ఉందట. వాస్తవానికి ‘భవిష్యత్తులో ఎప్పుడైనా దర్శకురాలిగా మారతా’ అని గతంలో నిత్యామీనన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసిందనిపిస్తోంది. ఎందుకంటే, ఓ సినిమా తెరకెక్కించడానికి నిత్యా సన్నాహాలు చేస్తున్నారట. కథానాయికగా ఆమె సంపాదించుకున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బాగా నటించడం మాత్రమే కాదు.. చక్కగా పాడతారు కూడా. తెలుగులో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. టోటల్‌గా ఈ కటౌట్‌కి చాలా టాలెంట్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి నిత్యామీనన్ ఇప్పటివరకూ దాదాపు 50 సినిమాలు చేశారు. ప్రస్తుతం విజయ్ సరసన ఆమె తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు దర్శకురాలిగా మారడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటివరకూ డైరెక్టర్ ‘స్టార్ట్... యాక్షన్’ అనగానే కెమేరా ముందు నటించిన నిత్యామీనన్ ఇప్పుడు తానే ‘స్టార్ట్.. యాక్షన్.. కట్’ చెప్పడానికి రెడీ అవుతున్నారన్నమాట.