తమిళసినిమా: యువ నటి నివేదా పేతురాజ్‌కు అవకాశాలు వరుసగా తలుపుతడుతున్నాయి. ఒరునాళ్ కూత్తు చిత్రంతో కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన ఈ దుబాయ్ రిటర్న్ తమిళ నటికి ఆ తరువాత కెరీర్ కాస్త తడబడ్డా తాజాగా వేగం పుంజుకుంది. నిజం చెప్పాలంటే జయంరవితో టిక్ టిక్ టిక్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం రావడంతోనే ఈ అమ్మడి లక్కు స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ చిత్రం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తొలి ఇండియన్ స్పేస్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలనంతరం తన టైమ్ బాగుంటుందని భావించిన నివేదా పేతురాజ్‌కు అంతకు ముందే భారీ అవకాశాలు వరించడం విశేషమే. ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటున్న ఈ బ్యూటీ నటించిన మూడు చిత్రాలు 2018లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి.
జయంరవితో నటించిన టిక్ టిక్ టిక్, వెంకట్‌ప్రభు నిర్మించిన పార్టీ, విజయ్‌ఆంథోనికి జంటగా నటిస్తున్న తిమిరు పుడిచవన్ చిత్రాలు ఈ ఏడాదిలో విడుదల కానున్నాయి. తాజాగా మరో లక్కీఛాన్స్ నివేదా పేతురాజ్‌ను వరించింది. డాన్సింగ్‌స్టార్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశమే అది. అవును ప్రభుదేవా తాజాగా హీరోగా జపక్ నెమీచంద్ ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుతో ప్రభుదేవా తొలిసారిగా పోలీస్ అధికారిగా నటించనున్నారు. మంచి యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు. ఏసీ.మౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాయకిగా నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేశారు. ఈమెతో పాటు ముఖ్యపాత్రల్లో సీనీయర్ దర్శకుడు మహేంద్రన్, సురేశ్‌మీనన్ నటించనున్నారు. మరోవిశేషం ఏమిటంటే ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారు. అజిత్ నటిస్తున్న విశ్వాసం చిత్రం తరువాత ఈయన కమిట్ అయిన చిత్రం ఇదే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment